లక్నో, సెప్టెంబర్ 3: మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదను అరికట్టడానికి యూపీలోని యోగి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. అయితే దీనిని ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ఇటీవల కాలంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడిలో భరూచ్ జిల్లాలో పలువురు మృతిచెందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. కాగా, సోమవారం తన అమ్మమ్మ పక్కన పడుకున్న ఐదేండ్ల బాలికను తోడేలు గాయపరిచింది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో అది పారిపోయింది. ఇటీవల కాలంలో తోడేళ్ల గుంపు చేసిన దాడిలో ఈ ప్రాంతంలో 34 మంది ప్రజలు గాయపడ్డారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అటవీ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా ‘ఆపరేషన్ భేడియా’ నిర్వహించి నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా మిగిలిన రెండు తోడేళ్ల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతున్నది. ఈ ప్రాంతాన్ని ఏడు జోన్లుగా విభజించి ఎప్పటికప్పుడు తోడేళ్ల జాడల కోసం ప్రయత్నిస్తున్నారు.