న్యూఢిల్లీ, జూన్ 21: 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేల నుంచి విద్యార్థులు, సాధారణ పౌరుల వరకూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పార్లమెంట్ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు, బీచ్‌లు, స్థానిక పార్క్‌లు, దేవాలయాల బయటి ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.
గతంలో యోగా అంటే ఇండ్లు, ఆధ్యాత్మిక ప్రాంతాలకే పరిమితమయ్యేదని, ప్రస్తుతం ప్రపంచంలోని నలుమూలలా దీన్నో పండుగగా జరుపుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది ‘యోగా ఫర్ హ్యూమానిటీ’ని (మానవత్వం కోసం యోగా) యోగా థీమ్‌గా వెల్లడించారు. వివిధ దేశాల్లోని భారత దౌత్యకార్యాలయాల్లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాల్దీవుల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని కొందరు రసాభాసగా మార్చారు. ఫుట్‌బాల్ స్టేడియంలోకి చొరబడిన దుండగులు అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.