Crime News : రాజస్థాన్ (Rajasthan) లోని జోధ్‌పూర్ (Jodhpur) లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. సంవత్సరాల తరబడి సామూహిక అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్‌కు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నెలల వ్యవధిలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యంవల్లే వారు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఈ-మిత్ర సెంటర్ నిర్వాహకుడు మహిపాల్ (Mahipal) తోపాటు 8 మంది యువకులు తనను కొన్నేళ్లుగా గ్యాంగ్ రేప్ చేసి, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువతి గత మార్చి 20న ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన తర్వాత ఏప్రిల్ 11న ఆమె చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నెలరోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిందితులు తనను కూడా బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి చెల్లెలు శుక్రవారం ఓ నీటి ట్యాంక్ ఎక్కి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది.
ఈ ఘటనపై రాజ్‌పుత్ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మృతదేహంతో ఎండీఎం ఆసుపత్రి వద్ద భారీ నిరసన చేపట్టారు. మార్వార్ రాజ్‌పుత్ సొసైటీ అధ్యక్షుడు హనుమాన్ సింగ్ ఖంగ్టా మాట్లాడుతూ.. పోలీసులే నిందితులను కాపాడుతున్నారని, వారి నిర్లక్ష్యం వల్లే ఇద్దరు యువతులు చనిపోయారని ఆరోపించారు. జోధ్‌పూర్ ఎస్పీ పీడీ నిత్య స్పందిస్తూ.. ప్రధాన నిందితుడు మహిపాల్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారిని విచారిస్తున్నామని తెలిపారు. బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.