Yasin Malik : పాకిస్థాన్ (Pakistan) లో 2006లో లష్కరే తోయిబా (Lashkar e Taiba) వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ (Hafeez Saeed) ను కలిసి మాట్లాడినందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) తనకు కృతజ్ఞతలు చెప్పారని జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ (Yasin Malik) తెలిపారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న మాలిక్.. ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
నాడు హఫీజ్‌తో సమావేశం అనంతరం తాను ఢిల్లీకి తిరిగిరాగానే అప్పటి జాతీయ భద్రతాసలహాదారు ఎంకే నారాయణన్ సమక్షంలో తాను నాటి ప్రధాని మన్మోహన్సింగ్ మీటింగ్ వివరాలను తెలిపానని మాలిక్ పేర్కొన్నారు. అనంతరం మన్మోహన్ సింగ్.. దేశంలో శాంతి కోసం ఉగ్రవాదులను కలిసినందుకు తనకు కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించారు. ‘కశ్మీర్లో అహింసా ఉద్యమానికి పిత’గా తనను అభివర్ణించారని తెలిపారు. కానీ ఆ తర్వాత టెర్రరిస్టులను విడిగా కలిశానని తనపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు.
నాడు తాను భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సూచన మేరకు దేశంలో శాంతి కోసమే హఫీజ్‌ను కలిశానని మాలిక్ వెల్లడించారు. దేశంలో శాంతి కోసం కేవలం పాకిస్థాన్ రాజకీయ నాయకులతో మాత్రమే కాకుండా, హఫీజ్ సయీద్ లాంటి పేరు మోసిన ఉగ్రవాదులను కూడా కలువాలని అప్పటి ఐబీ చీఫ్ వీకే జోషి సూచించినట్లు తెలిపారు. కాగా, కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మాలిక్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యేలా కనిపిస్తున్నాయని అన్నారు.