నైపేయీ, సెప్టెంబర్ 17: ‘యాగి’ టైఫూన్ తాకిడికి మయన్మార్ విలవిల్లాడుతున్నది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగి పడి.. ఇప్పటివరకు కనీసం 236మంది మరణించారు. సైనిక తిరుగుబాటుతో సంక్షోభంలో కూరుకుపోయిన మయన్మార్‌ను ‘యాగి’ టైఫూన్ మరింత దెబ్బతీసింది. రాజధాని నైపేయీ సహా పలు రాష్ర్టాల్ని వరదలు ముంచెత్తాయి. వరదల్లో దాదాపు 77 మంది గల్లంతయ్యారని ఆ దేశ ప్రభుత్వ మీడియా ‘గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్’ మంగళవారం పేర్కొన్నది. వరదల కారణంగా 6,31,000 మంది నిరాశ్రయలయ్యారని తెలిపింది. వారం రోజుల క్రితం ‘యాగి’ టైఫూన్ ఫిలిప్పీన్స్‌లో తీరాన్ని తాకింది. దీంతో దక్షిణ చైనా, వియత్నాం, లావోస్, మయన్మార్, బంగ్లాదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాగి టైఫూన్ వియత్నాంలో అల్లకల్లోలం సృష్టించింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడగా.. కనీసం 59 మంది చనిపోయారు. బంగ్లాదేశ్‌లో మునుపెన్నడూ లేనంతగా లక్షలాది మంది వరదల్లో చిక్కుకుపోయారు. ఫిలిప్పీన్స్‌లో 11 మంది మృతిచెందారు.