న్యూఢిల్లీ: కప్ప కణాల నుంచి తయారు చేసిన జెనోబాట్స్ ఆశ్చర్యకరమైన స్వయంప్రతిపత్తిని ప్రదర్శిస్తున్నాయి. దీంతో చావు, బతుకుల మధ్య మరో స్థితి ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కొన్ని కణాలకు మరణమే చివరి మజిలీ కాదని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. జెనోబాట్స్ అంటే ప్రయోగశాలలో రూపొందించిన బహుళ కణాల జీవి. కప్ప పిండంలోని కణాలతో దీనిని తయారు చేస్తారు. ఈ జెనోబాట్స్ వివాదాస్పద, అసాధారణ లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఇవి రోబోలు కాదు, ఇవి జీవ యంత్రాలు. వీటిని శాస్త్రవేత్తలు కంప్యూటర్ ఆధారిత సాధనాల సహాయంతో అమర్చారు.
బర్మింగ్‌హాంలోని అలబామా విశ్వవిద్యాలయం మైక్రోబయాలజిస్ట్ పీటర్ నోబుల్, సిటీ ఆఫ్ హోప్ కేన్సర్ సెంటర్ బయో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చర్ అలెక్స్ పొఝిట్కోవ్ కలిసి సెల్స్‌ను డిజైన్ చేశారు. ఈ కణాలు కదలడం, అత్యంత సూక్ష్మమైన కణాలను సేకరించడం లేదా తోయడం వంటి పనులను కూడా చేస్తాయి. దెబ్బతిన్న కణాలు తమను తామే మరమ్మతు చేసుకోగలవు. ఈ కణాలు కప్పలో ఉన్నప్పటి మాదిరిగా ప్రవర్తించవు. ఈ కణాలు సహజమైన కణాలు, కానీ కొత్త నిర్మాణంలో నూతన పనిని అప్పగించారు. కణాలు నూతన రూపంలోకి, నూతన పరిసరాల్లో నూతన నిర్మాణంలోకి తమను తాము అమర్చుకోగలవని జెనోబాట్స్ జీవితపు తృతీయ స్థితిగా రూపొందుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.