న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారత్ మరో మైలురాయిని సాధించనున్నది. హీట్ స్టేబుల్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తుండగా.. త్వరలో అందుబాటులోకి రానున్నది. ఈ టీకాకు కోల్డ్ చైన్ స్టోరేజీ అవసరం ఉండదు. వ్యాక్సిన్‌ను ఎలుకలపై పరీక్షించగా.. ప్రాథమిక అధ్యయనంలో వ్యాక్సిన్ డెల్టా, ఒమిక్రాన్‌తో పాటు ఇతర రకాల వేరియంట్లకు వ్యతిరేకంగా బలమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుందని గుర్తుంచారు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే డెల్టాపై రెండున్నర రెట్లు, ఒమిక్రాన్ పై 16.5 రెట్లు సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బయోటెక్ స్టార్ట్-అప్ కంపెనీ మైన్‌వ్యాక్స్ ఈ వార్మ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఈ కరోనా వ్యాక్సిన్‌ను 37 డిగ్రీల వద్ద నాలుగు వారాల వరకు, 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 90 నిమిషాల వరకు నిల్వ చేయవచ్చని ఆస్ట్రేలియా కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CSIRO) పరిశోధకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చాలా టీకాలు ప్రభావంతంగా పని చేయడానికి తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. టీకాలను నిర్ణీత ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తుంటారు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రవాణా చేసేందుకు సైతం శీతల పరిస్థితులు అవసరం.
వార్మ్ వ్యాక్సిన్‌కు ఇకపై ఇవన్నీ అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ రెండు నుంచి ఎనిమిది డిగ్రీలు, ఫైజర్‌కు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. మరో వైపు వార్మ్ వ్యాక్సిన్‌కు సంబంధించి త్వరలోనే హ్యూమన్-1 ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న దేశాలు, ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడంతో పాటు రవాణా చేయడం సులువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.