Devin AI | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన ఆవిష్కరణలకు కృత్రిమ మేధ (ఏఐ) శ్రీకారం చుడుతున్నది. న్యూస్ రీడర్‌గా మారి వార్తలు చదవడం, పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు.. ఇప్పుడు ఏకంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అవతారమెత్తి ప్రోగ్రామ్స్‌ను రాసే స్థాయికి చేరుకొన్నది. అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘కాగ్నిషన్’ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను రూపొందించింది. ‘డెవిన్’గా నామకరణం చేసిన ఈ ఏఐ టెకీ ప్రపంచంలోనే మొట్టమొదటిది కావడం విశేషం.
ఏ పనులు చేస్తుంది?
ఒక కమాండ్ లేదా ప్రాంప్ట్ ఇస్తే చాలు అలవోకగా ప్రోగ్రామ్ కోడ్ మొత్తాన్ని రాసేస్తుంది. చిటికెలో వెబ్సైట్లను క్రియేట్ చేస్తుంది. ఇచ్చిన ఇన్‌పుట్స్‌కు అనుగుణంగా నచ్చిన వీడియోలను క్రియేట్ చేస్తుంది. ప్రోగ్రామ్స్‌లో బగ్స్ గుర్తించడంతో పాటు వాటికి పరిష్కారాలను సూచిస్తుంది.
కచ్చితత్వం ఎలా?
మనం అడిగే ప్రశ్నలకు ఏఐ చాట్‌జీపీటీ దాదాపుగా కచ్చితత్వంతో సమాధానాలను ఇస్తుందని భావిస్తున్నాం. అయితే, ఏఐ యూనివర్సల్ గ్రాఫ్‌లో చాట్‌జీపీటీ కచ్చితత్వాన్ని 0.52 శాతం గా లెక్కిస్తే, డెవిన్ కచ్చితత్వం 13.86 శాతంగా నమోదైంది. దీన్ని బట్టి ఈ టెకీ ఎంత కచ్చితత్వంతో ప్రోగ్రామ్స్‌ను డిజైన్ చేస్తుందో అర్థంచేసుకోవచ్చు.
టెకీల ఉద్యోగాల మాటేమిటి?
ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను తీసుకొస్తే, తమ ఉద్యోగాల మాటేమిటి? అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారికి కాగ్నిషన్ కంపెనీ వివరణ కూడా ఇచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ఏఐ ఇంజినీర్లతో భర్తీ చేయాలనే ఉద్దేశం తమకు లేదని.. కేవలం వారి పనుల్ని సులభతరం చేయడంలో భాగంగా మాత్రమే డెవిన్‌ను రూపొందించామని తెలిపింది.