మొత్తం అణ్వాయుధాల్లో అమెరికా, రష్యా వాటా 90%
2035 నాటికి చైనా సమకూర్చుకోవాలనుకుంటున్న అణ్వాయుధాల సంఖ్య 1500
గత రెండేండ్లలో చైనా సమకూర్చుకున్న అణు వార్ హెడ్లు 100
న్యూఢిల్లీ : మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతున్నది. ఆయా దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. చైనా గత రెండేండ్లలోనే ఏకంగా 100 అణు వార్ హెడ్లను తన అమ్ములపొదిలోకి చేర్చుకున్నట్టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం చైనా వద్ద కనీసం 600 వార్హెడ్లు ఉన్నట్టు తెలిపింది. ఆయుధ నియంత్రణ విధానాలు బలహీనపడుతున్న ప్రస్తుత సమయంలో ప్రమాదకరమైన కొత్త అణ్వాయుధ పోటీ ఉద్భవిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేసింది.
అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్ వంటి 9 అణ్వాయుధ దేశాల్లో దాదాపు అన్నీ 2024లో తీవ్రమైన అణ్వాయుధ ఆధునికీకరణ కార్యక్రమాలను కొనసాగించాయని, ఇప్పటికే ఉన్న ఆయుధాలను అప్గ్రేడ్ చేసి కొత్త వెర్షన్లను జోడించాయని సిప్రి నివేదిక పేర్కొన్నది. 2035 నాటికి చైనా 1500 అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని అనుకుంటున్నట్టు నివేదిక వెల్లడించింది.