న్యూఢిల్లీ: ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవమని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అన్న ఆయన.. సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయమని చెప్పారు. కోట్ల మంది త్యాగాలతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం కోసం ప్రాణ త్యాగం చేశారని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. వీరజవాన్లకు జవాన్లకు సెల్యూట్ చేసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడులక సందర్భంగా ప్రధాని మోదీ వరుసగా 12వ సారి ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. బ్లాక్ మెయిల్‌కు భారత్ తలవంచే రోజులు పోయాయన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో మన దేశ సత్తా చాటామని చెప్పారు. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదంటూ దాయాది పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీచేశారు. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదన్నారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మళ్లీ చెబుతున్నానని వెల్లడించారు. సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదని స్పష్టం చేశారు.
‘ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. పహల్గాంలో మతం పేరుతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. భార్య ముందే భర్తలను చంపేశారు. పిల్లల ముందే తండ్రిని చంపేశారు. మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాం. యావత్ దేశం ఆగ్రహంతో రగిపోయింది. మన సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో మన దేశ సత్తా చాటాం. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుంది. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేఛ్చ త్రివిధ దళాలకే ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ హీరోలకు నా సెల్యూట్.
ఇకపై భారత్ ఎవరి బ్లాక్ మెయిల్ నడవదు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవని మళ్లీ చెబుతున్నా. ఉగ్రవాదులకు సాయం చేసే వారినీ వదలిపెట్టం. బ్లాక్ మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటి బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పాం. సింధూ నది జలాలపై భారత్‌కు పూర్తి హక్కులున్నాయి. ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బంది పడ్డారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తాం. సింధూ నదిలో నీరు భారతీయుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. దీనిపై ఎప్పటికీ చర్చల ప్రసక్తే లేదు.
ఆపరేషన్ సిందూర్‌తో మేడిన్ ఇండియా సత్తా ప్రపంచానికి చాటి చెప్పాం. ఆత్మనిర్భర్ అంటే డాలర్, పౌండ్‌పై ఆధారపడటం కాదు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్.. ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా నడుస్తోంది. న్యూక్లియర్ ఎనర్జీపై భారత్ చొరవ చూపిస్తోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్వయం సమృద్ధిపై వెనక్కి తగ్గేది లేదు. ప్రతీ రంగంలో భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. 2030లోగా భారత్‌లో 50 శాతం క్లీన్ ఎనర్జీ తీసుకురావడం లక్ష్యం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయం సమృద్ధి కాదు. స్వయం సమృద్ధి అంటే సమున్నతంగా నిలబడటం. మేక్ ఇన్ ఇండియా నినాదం రక్షణ రంగంలో మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. టెక్నాలజీ సాయం కోసం భారత్ ఇప్పుడు ప్రపంచాన్ని అర్థించడం లేదు. ప్రపంచ దేశాలకు సాయం, టెక్నాలజీ అందిస్తున్నాం. ఆత్మ నిర్భర్ భారత్‌తో మన సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసింది. సొంత సోషల్ మీడియా స్లాట్ఫామ్స్ వైపు యువత దృష్టి సారించాలి. ఫైటర్ జెట్లకు మేడిన్ ఇండియా ఇంజిన్లపై దృష్టిపెడతాం. కొత్త ఇందనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2047 నాటికి న్యూక్లియర్ ఎనర్జీని 10 రెట్లు పెంటాలని నిర్ధేశించుకున్నాం. 10 కొత్త అణు రియాక్టర్లపై వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతున్నది. ఈ విషయంలో స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. ఖనిజాల కోసం 1200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో మేడిన్ ఇండియా చిప్స్ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో భారత్ ఎప్పుడో ఆలోచన చేసింది.
రసాయన ఎరువుల దిగుమతులు భారత్‌ను భారత్‌ను కుంగదీస్తున్నాయి. మన అవసరాలకు అనుగుణంగా నవీన సాంకేతికత ఆవిష్కరణల అవసరం ఉన్నది. రైతులు రసాయనిక ఎరువుల వినియోగంలో సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఈవీ బ్యాటరీల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. ఈవీ బ్యాటరీల తయారీలో మన యువత ప్రపంచ దేశాలతో పోటీపడాలి. అంతరిక్ష పరిశోధనల్లోనూ భారత్ తనదైన ముద్ర వేస్తున్నది. గగన్‌యాన్‌తో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది.’ అని మోదీ అన్నారు.