న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రోహాన్ని సహించబోమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. జూలై 25న విద్యార్థి ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడానికి దారితీసిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. (CJP march) ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు శాంతియుతంగా జెన్ జెడ్ నిరసన ర్యాలీ చేపడతామని ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశమైంది. నీట్ లీక్ వివాదంపై జంతర్‌మంతర్ వద్ద జూలైలో జరిగిన నిరసనలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవడం లేదా రద్దు చేయడం, మరణించిన నీట్ బాధిత కుటుంబాలకు పరిహారంతోపాటు దేశంలోని యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలపై సమీక్షించారు. అనంతరం మరో నిరసనకు నిర్ణయం తీసుకున్నారు.
కాగా, జెన్ జెడ్, యువ నిరసనకారులు, మరణించిన వారి కుటుంబాల పట్ల కేంద్రం ద్రోహాన్ని తాము అంగీకరించబోమని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. జూలై 25న విద్యార్థి నిరసనకారులకు ఇచ్చిన హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా అనే దానిపై తమకు నమ్మకం లేదని అన్నారు. అందువల్ల సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు శాంతియుత నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చినట్లు వివరించారు. ‘ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలు, జూలై 20 నాటి పోలీసుల దురాగత బాధితులు ఈ నిరసనకు నాయకత్వం వహిస్తారు’ అని పేర్కొన్నారు.