ముంబై, డిసెంబర్ 25: దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్రలోని బైకుల్లా మహిళా జైలులో ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర జైళ్లశాఖ అధిపతి అమితాబ్గుప్తా దీన్ని శుక్రవారం ప్రారంభించారు. రేడియో జాకీగా మహిళా ఖైదీ శ్రద్ధా చౌగులే అమితాబ్ గుప్తాను ఇంటర్వ్యూ చేశారు. జైలులో ఎఫ్ఎం రేడియో ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలను ఆయన వెల్లడించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పాటలు, ఇతర కార్యక్రమాలతో మహిళా ఖైదీలు సాంత్వన పొందడంతోపాటు జైలు నుంచి విడుదలైన తర్వాత ఖైదీలు రేడియో జాకీలుగా కెరీర్ ప్రారంభించేదుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే నాగ్పూర్, కోల్హాపూర్, అమరావతి, ఫుణెలోని యరవాడ సెంట్రల్ జైళ్లలో ఎఫ్ఎం రేడియో కేంద్రాలు ఉన్నాయి. అయితే మహిళల జైలులో ఎఫ్ఎం రేడియో ఉండటం ఇదే తొలిసారి.