లక్నో: ట్రాలీ సూట్‌కేస్‌లో యువతి మృతదేహం లభించింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఈ సంఘటన జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో ఒక లగేజ్ ట్రాలీ పడి ఉంది. అనుమానించిన స్థానిక కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు దానిని తెరిచి చూశారు. పాలిథిన్ కవర్లో చుట్టి ఉన్న యువతి మృతదేహం అందులో ఉండటం చూసి షాకయ్యారు.
కాగా, మృతురాలి వయసు 20 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఆమె ముఖంపై రక్తం, శరీరంపై గాయాలు ఉన్నాయని చెప్పారు. ఆ యువతిని ఎక్కడో హత్య చేసిన హంతకులు, మృతదేహాన్ని లగేజ్ ట్రాలీ సూట్‌కేస్‌లో కుక్కి యమునా ఎక్స్‌ప్రెస్ వే సమీపంలో రాత్రి వేళ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించినట్లు పోలీస్ అధికారి మహావన్ అలోక్ సింగ్ తెలిపారు. మృతురాలు ఎవరన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.