Bihar | దర్భంగ : బీహార్‌లోని దర్భంగ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి తన మరదలితో స్వలింగ సంబంధం పెట్టుకొని ఆమెను రహస్యంగా పెండ్లాడి పరారైంది. ఈ నెల 26న ఆమె, ఆమె భర్త, మైనర్ మరదలు రాజస్థాన్ నుంచి ఆమె స్వగ్రామం కుషెష్వర్స్థాన్కు తిరిగి వచ్చినప్పుడు ఆమెను, ఆమె భర్తను బహెరి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని కోర్ట్ ఆదేశించింది. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె కుటుంబానికి అప్పజెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం క్రితి దేవికి 11 ఏండ్ల క్రితం కృష్ణ మాంఝీతో పెండ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. క్రితి దేవి మైనర్ బాలిక పెద్ద అక్కకు వదిన అవుతుంది. క్రితి దేవి రెండేండ్లుగా తమ ఇద్దరి కుటుంబాలకు తెలియకుండా మైనర్ బాలికతో ప్రేమాయణం సాగిస్తున్నది. క్రితి దేవి వదిలేస్తానని తరచూ తన భర్తను బెదిరించేది. అలాగే తన మైనర్ ప్రియురాలితో సంబంధాన్ని వదిలి పెట్టనని చెప్పేది. అయితే ఈ నెల 6న మైనర్ బాలిక తండ్రి తన కూతురు అపహరణకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా క్రితి దేవి, మైనర్ రహస్యంగా పెండ్లి చేసుకొని రాజస్థాన్‌కు పారిపోయారు. ఈ విషయం తెలిసి భర్త హెచ్చరించినా ప్రియురాలితో సంబంధాన్ని తెంచుకోవడానికి క్రితి దేవి నిరాకరించింది. ఈ ఘటనపై మైనర్ తల్లి స్పందిస్తూ క్రితి దేవిని ఒక కుటుంబ సభ్యురాలిగా గౌరవించి తమ కుటుంబంలోకి ఆహ్వానించామని.. అయితే ఆమె ఉద్దేశం తెలిసి ఉంటే ఆమెను ఇంట్లోకే రానిచ్చే వాళ్లమే కాదని తెలిపారు.