గౌహతి: గొడవ నేపథ్యంలో పొరుగున నివసించే వ్యక్తి ఒక మహిళ పిల్లల ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చేతులు, కాళ్లు కట్టేసి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయాడు. (Woman Raped, Acid Poured) ఇంటికి తిరిగి వచ్చిన భర్త ఇది తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అస్సాంలోని కాచార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 22న పొరుగున ఉండే 28 ఏళ్ల వ్యక్తి, 30 ఏళ్ల మహిళ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని ఆమె తిట్టింది.
కాగా, కొన్ని గంటల తర్వాత మహిళ భర్త బయటకు వెళ్లినప్పుడు ఆ వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. పిల్లల ముందే ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కాళ్లు, చేతులు కట్టేసి యాసిడ్ పోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన భర్త తన భార్య పరిస్థితిని చూశాడు. పొరుగు వ్యక్తి అఘాయిత్యం చేసినట్లు, యాసిడ్ పోసినట్లు తెలుసుకున్నాడు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళను సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
కాగా, బాధిత మహిళ శరీరంపై యాసిడ్ గాయాలున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అత్యాచారం గురించి నిర్ధారిస్తామని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.