తిరువనంతపురం: ఒక మహిళ నర్సుగా నటించింది. (woman poses as nurse) బిడ్డను ప్రసవించిన తల్లిని చంపేందుకు ప్రయత్నించింది. ఖాళీ సిరంజి ద్వారా రక్త నాళాల్లోకి గాలిని పంపి హత్య చేసేందుకు యత్నించింది. బాలింత తల్లి గమనించి ఆసుపత్రి సిబ్బందిని అలెర్ట్ చేసింది. దీంతో ఆ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏండ్ల స్నేహ రెండు రోజుల కిందట ఒక బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం కేర్ కోసం పరుమల సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయ్యింది.
కాగా, శుక్రవారం 30 ఏళ్ల అనూష ఆ ఆసుపత్రికి వెళ్లింది. నర్సుగా పేర్కొని స్నేహ ఉన్న గదిలోకి వెళ్లింది. ఇంజెక్షన్ చేయాలని ఆమెతో చెప్పింది. అయితే ఖాళీ సిరంజి ద్వారా స్నేహ రక్త నాళాల్లోకి గాలిని పంపేందుకు రెండుసార్లు ప్రయత్నించింది. ఫలించకపోవడంతో మరోసారి ప్రయత్నం చేస్తుండగా పక్కనే ఉన్న స్నేహ తల్లి దీనిని గమనించింది. అనూష తీరుపై అనుమానించి మిగతా నర్సు సిబ్బందికి ఈ విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది అనూషను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మరోవైపు అదుపులోకి తీసుకున్న అనూష గురించి పోలీసులు ఆరా తీశారు. స్నేహ భర్తకు ఆమె స్నేహితురాలని తెలుసుకున్నారు. అలాగే అనూష సోదరి, స్నేహ భర్త క్లాస్మేట్స్ అని పోలీసులు తెలిపారు. స్నేహ భర్త ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని చెప్పారు. బిడ్డకు జన్మనిచ్చిన స్నేహను అనూష ఎందుకు హత్య చేయాలని ప్రయత్నించింది అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.