లక్నో: పెళ్లైనప్పటికీ ప్రియుడితో కలిసి జీవించాలని మహిళ భావించింది. వివాహమైన రెండు వారాలకే భర్తను చంపించింది. (woman kills husband with lover) ప్రియుడు, కాంట్రాక్ట్ కిల్లర్‌తో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో మీరట్ తరహా హత్య కేసు వెలుగుచూసింది. ఒకే గ్రామానికి చెందిన ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే ఈ ఏడాది మార్చి 5న 22 ఏళ్ల దిలీప్ యాదవ్‌తో ప్రగతికి ఆమె కుటుంబం బలవంతంగా పెళ్లి చేసింది.
కాగా, ఇష్టం లేని పెళ్లి వల్ల ప్రగతి అంసతృప్తితో రగిలిపోయింది. ప్రియుడు అనురాగ్‌తో కలిసి జీవించాలని ఆమె భావించింది. దీంతో పెళ్లైన రెండు వారాలకే భర్త దిలీప్‌ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. దిలీప్ సంపన్నుడు కావడంతో అతడి హత్య తర్వాత ఇద్దరం కలిసి సుఖంగా జీవించవచ్చని అనురాగ్‌కు చెప్పింది. భర్త దిలీప్ హత్య కోసం ప్రియుడు అనురాగ్‌కు లక్ష ఇచ్చింది. దీంతో కాంట్రాక్ట్ కిల్లర్ రామ్‌జీని అతడు సంప్రదించాడు. దిలీప్ హత్య కోసం రెండు లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు.
మరోవైపు మార్చి 19న దిలీప్ పని నిమిత్తం కన్నౌజ్ జిల్లాకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. రోడ్డు పక్కన ఒక హోటల్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అతడి సహాయం కోరారు. తమ వాహనం పాడైందని నమ్మించి బైక్‌పై అతడ్ని తీసుకెళ్లారు. ఒకచోట దిలీప్‌ను కొట్టి అతడిపై కాల్పులు జరిపారు. మరణించినట్లు భావించి సమీపంలోని పొలంలో అతడ్ని పడేసి వెళ్లిపోయారు.
అయితే ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో పొలంలో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్నారు. దిలీప్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మరణించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.
కాగా, దిలీప్‌ను ఒక వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ కిల్లర్ రామ్‌జీ నగర్‌గా అతడ్ని గుర్తించారు. అతడితోపాటు అనురాగ్‌ను అరెస్ట్ చేశారు. వారిద్దరిని ప్రశ్నించగా దిలీప్ హత్యకు అసలు సూత్రధారి కొత్త పెళ్లికూతురు ప్రగతిగా తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. దీంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.