లక్నో: ఒక మహిళ దారుణానికి పాల్పడింది. నాలుగేళ్ల కుమారుడ్ని చంపింది. (Woman Kills Son) మృతదేహాన్ని ఇంట్లో తగులబెట్టేందుకు ప్రయత్నించింది. ఇది చూసి షాకైన ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు పాక్షికంగా కాలిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జలాల్పూర్ గ్రామానికి చెందిన ఆదేశ్ దేవి బుధవారం ఉదయం తన నాలుగేళ్ల కొడుకు హర్షాను హత్య చేసింది. అనంతరం కుమారుడి మృతదేహాన్ని ఇంట్లోనే తగులబెట్టేందుకు ప్రయత్నించింది.
కాగా, పొలం పనుల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన మహిళ భర్త కపిల్ ఇది చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. పాక్షికంగా కాలిన బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడ్ని చంపిన తల్లి ఆదేశ్ దేవిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.