లక్నో: ప్రియుడితో గొడవపడిన మహిళ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా మరణించింది. (Woman Jumps From Building) ఈ నేపథ్యంలో ఆ మహిళ బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల మహిళ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నది. ప్రయాగ్‌రాజ్‌లోని అల్లాపూర్ ప్రాంతంలో ఆమె నివసిస్తున్నది. ఈ నెల 20న ప్రియుడు సౌరభ్ సింగ్‌తో గొడవపడిన ఆమె కోచింగ్ సెంటర్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, సౌరభ్ సింగ్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి తన కుమార్తెను వేధించడంతోపాటు కొట్టాడని ఆ మహిళ తండ్రి ఆరోపించాడు. కోచింగ్ సెంటర్ బిల్డింగ్ కారిడార్‌పై నుంచి దూకమని ఆమెను బలవంతం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సౌరభ్, ఆ మహిళ మధ్య సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఆమె తన గర్ల్‌ఫ్రెండ్ అని మరో వ్యక్తి సౌరభ్‌కు చెప్పాడని, దీనిని ధృవీకరించడానికి సౌరభ్ ఆమెను కలిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో బిల్డింగ్ పైనుంచి ఆమె దూకిందని పోలీసులు తెలిపారు. ప్రియుడు సౌరభ్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.