లక్నో: కుమార్తె ప్రేమ వ్యవహారంపై ఆమె తల్లి కలత చెందింది. కూతుర్ని చంపేందుకు ఒక వ్యక్తిని నియమించింది. అయితే కుమార్తె ప్రియుడైన ఆ వ్యక్తి చివరకు ఆ మహిళను హత్య చేశాడు. (Woman Killed by Daughter’s Lover) క్రైమ్ సినిమాను తలపించేలా ఉన్న ఈ విషయం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల అల్కా దేవి మైనర్ కుమార్తెను అఖిలేష్, అనికేత్ ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశారు. బాలిక కుటుంబం ఫిర్యాదుతో నయా గావ్ పోలీసులు అఖిలేష్‌ను అరెస్ట్ చేశారు. ఆ బాలికను రక్షించి ఆమె కుటుంబానికి అప్పగించారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో తల్లి అల్కా దేవి తన కుమార్తె గురించి ఆందోళన చెందింది. ఫరూఖాబాద్ జిల్లా సికందర్పూర్ ఖాస్ గ్రామంలోని తన తల్లి ఇంటికి ఆమెను పంపింది. అయితే ఆ బాలిక అక్కడ 38 ఏళ్ల సుభాష్‌తో సంబంధాన్ని పెంచుకుంది. గతంలో పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన అతడు ఆ బాలికకు మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. దీంతో వారిద్దరూ మాట్లాడుకోసాగారు.
మరోవైపు కుమార్తె ప్రేమ వ్యవహారం సంగతి తెలిసి తల్లి అల్కా దేవి కలత చెందింది. కూతుర్ని చంపించాలని ప్లాన్ వేసింది. నేర చరిత్ర ఉన్న సుభాష్‌ను సంప్రదించి రూ.50,000కు ఒప్పందం చేసుకున్నది. అయితే హత్య కోసం నియమించిన వ్యక్తి కుమార్తె ప్రియుడే అన్న సంగతి అల్కా దేవికి తెలియదు.
కాగా, అల్కా దేవి హత్య కుట్ర గురించి ఆమె కుమార్తెకు సుభాష్ చెప్పాడు. దీంతో తన తల్లిని చంపితే అతడ్ని పెళ్లి చేసుకుంటానని ఆ యువతి ప్రపోజ్ చేసింది. వారిద్దరూ కలిసి అల్కా దేవి హత్యకు ప్లాన్ వేశారు. అక్టోబర్ 5న ఆగ్రాలోని రామ్‌లీలా జాతర చూసేందుకు ఆమెతో కలిసి వాహనంలో వెళ్లారు. ఒకచోట అల్కా దేవి గొంతు నొక్కి హత్య చేశారు. మృతదేహాన్ని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు.
మరోవైపు అక్టోబర్ 6న అల్కా దేవి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో తమ కుమార్తెను కిడ్నాప్ చేసిన అఖిలేష్, అనికేత్‌పై ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. అయితే కుమార్తె తన ప్రియుడితో కలిసి అల్కా దేవిని చంపినట్లు దర్యాప్తులో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. సుభాష్‌తోపాటు ఆ యువతిని అరెస్ట్ చేశారు.