బెంగళూరు: భార్యాభర్తలు అనుమానాస్పదంగా మరణించారు. (Couple found dead) ఇంట్లో సీలింగ్‌కు వేలాడుతూ భార్య చనిపోగా, సమీపంలోని చెరువులో భర్త మృతదేహం లభించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నాటకలోని మాండ్యా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల మోహన్, 22 ఏళ్ల స్వాతికి రెండేళ్ల కిందట పెళ్లి జరిగింది. వారికి ఏడాది వయస్సున్న కుమార్తె ఉంది.
కాగా, మంగళవారం సాయంత్రం ఇంట్లో సీలింగ్‌కు వేలాడుతూ స్వాతి మరణించింది. వారి ఇంటికి కిలోమీటరు దూరంలోని చెరువులో భర్త మోహన్ మృతదేహాన్ని బుధవారం ఉదయం పోలీసులు గుర్తించారు. పెళ్లి నాటి నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు వరకట్నం కోసం మోహన్ కుటుంబం తమ కుమార్తెను వేధించినట్లు స్వాతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వాతిని మోహన్ హత్య చేసి ఆ తర్వాత చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపించారు. ఆందోళనకు దిగిన స్వాతి తల్లిదండ్రులు, బంధువులు సమీపంలోని ఒక షెడ్డుకు నిప్పు పెట్టారు.