న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో జరిగిన బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసు(BMW Hit And Run Case)లో.. ఇవాళ ఆ కారు డ్రైవర్ గగన్‌ప్రీత్‌ను అరెస్టు చేశారు. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్, ఆయన భార్య సందీప్ కౌర్ బైక్‌పై వెళ్తుండగా ఆ వాహనాన్ని బీఎండబ్ల్యూ కారు ఢీకొన్నది. ఆదివారం జరిగిన ఆ ప్రమాదంలో ఆర్థికశాఖ ఆఫీసర్ నవజ్యోత్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇదే ప్రమాదంలో గాయపడ్డ బీఎండబ్ల్యూ డ్రైవర్ గగన్‌ప్రీత్ హాస్పిటల్లో చికిత్స పొందింది. ఆమెను ఇవాళ పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
హిట్ అండ్ రన్ ఘటనలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కింద సెక్షన్ 281, ప్రమాదభరిత ప్రవర్తన కింద 125 బీ , హత్యాయత్నం కింద 105 సెక్షన్, తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో 238 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్యామేజ్ చెందిన వాహనాన్ని ఎఫ్ఎస్ఎల్ బృందం తనిఖీ చేసింది.
బీఎండబ్ల్యూ కారును ఓ మహిళ డ్రైవ్ చేసిందని, సెంట్రల్ వర్జ్ను ఢీకొన్న తర్వాత ఆ వాహనం కంట్రోల్ తప్పి, బైక్‌ను ఢీకొన్నదని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. బీఎండబ్ల్యూ ఓనర్లు లెదర్ సీట్లు, కవర్లు, బెల్టుల తయారీలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
ఆర్థికశాఖ ఎకనామిక్ అఫైర్స్‌లో డిప్యూటీ సెక్రటరీగా చేస్తున్న నవజ్యోత్ సింగ్.. హరినగర్‌లో నివాసం ఉంటున్నారు. బీఎండబ్ల్యూ డ్రైవర్ గగన్‌ప్రీత్ వయసు 38 ఏళ్లు. ఆమె భర్త పరీక్షిత్ మక్కడ్ వయసు 40 ఏళ్లు. ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది.
బైక్‌ను ఢీకొన్న తర్వాత బాధితులు నవజ్యోత్, సందీప్ కౌర్‌లను ఓ వ్యాన్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. జీటీబీ నగర్లో ఉన్న న్యూలైఫ్ ఆస్పత్రికి వాళ్లను తరలించారు. అయితే ఆ ఆస్పత్రి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాల తర్వాత ఆ ఆస్పత్రికి, బీఎండబ్ల్యూ డ్రైవర్ గగన్‌ప్రీత్‌కు నేరుగా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చిందన్న అంశంపై విమర్శలు వస్తున్నాయి.