ముంబై: డాక్టర్లైన దంపతులు రైలులో ప్రయాణించారు. మహిళ హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగ లాక్కొన్నాడు. బ్యాగ్ పట్టుకున్న ఆమెను డోర్ వరకు లాక్కెళ్లాడు. అప్రమత్తమైన భర్త తన భార్యను కాపాడేందుకు ప్రయత్నించి చేతిని కోల్పోయాడు. (Husband Loses Arm) మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ముంబైకి చెందిన 50 ఏళ్ల యోగేష్ దేశ్‌ముఖ్, 44 ఏళ్ల భార్య దీపాలీ డాక్టర్లు. జూన్ 4న తమ తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి లోక్మాన్య తిలక్ టెర్మినస్ (కుర్లా)-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు.
కాగా, రైలు కుర్లా స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక దొంగ దీపాలీ హ్యాండ్‌బ్యాగ్‌ను లాక్కొనేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె తన హ్యాండ్‌బ్యాగ్‌ను గట్టిగా పట్టుకున్నది. దీంతో దొంగ హ్యాండ్బ్యాగ్తోపాటు ఆ మహిళను ఆ కోచ్ డోర్ వరకు లాక్కెళ్లాడు.
మరోవైపు పై బెర్తుపై నిద్రిస్తున్న దీపాలి భర్త యోగేష్ అప్రమత్తమై ఆమెను రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి భార్యాభర్తలిద్దరూ కదులుతున్న రైలు నుంచి పడిపోయారు. దీపాలి తీవ్రంగా గాయపడగా, భర్త యోగేష్ చేతి భాగం రైలు చక్రాల కింద నలిగిపోయింది. రైలు వేగం తగ్గడంతో దొంగ జంప్ చేసి హ్యాండ్‌బ్యాగ్‌తో పారిపోయాడు.
కాగా, రైలు పట్టాల వద్ద పడిన డాక్టర్ దంపతులు పోలీసుల సహాయం కోసం ప్రయత్నించారు. అయితే వారు ఉన్న ప్రాంతం ఏమిటో చెప్పలేకపోయారు. చివరకు ఒక మినీ లారీ డ్రైవర్ వీరిని గమనించాడు. వారు సహాయం కోరడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు స్పందించారు. రైలులో ఉన్న డాక్టర్ దంపతుల 9 ఏళ్ల కుమార్తెను కల్యాణ్ స్టేషన్లో సురక్షితంగా దించారు. రైలులో హ్యాండ్‌బ్యాగ్ చోరీపై కేసు నమోదు చేశారు. నిందితుడ్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Also Read: