Doctor Threaten | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా దవాఖానలో మహిళా వైద్యురాలి హత్యోదంతంతో తలెత్తిన కలకలం చల్లారక ముందే పుర్బా బర్ధమాన్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో మరో ఘటన చోటు చేసుకున్నది. పుర్బా బర్ధమాన్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలిని, నర్సింగ్ సిబ్బందిని ఓ రోగి బెదిరించారు. తనకు వైద్య చికిత్స ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సదరు రోగి బెదిరింపులకు దిగాడు.
మత్తులో దవాఖాన ఎమర్జెన్సీ విభాగంలోకి ప్రవేశించిన రోగి.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా వైద్యురాలిని బెదిరించాడు. తనకు వైద్య చికిత్స ఆలస్యమైతే.. కోల్కతా దవాఖానలో ట్రైనీ మెడికోకు ఎదురైన అనుభవమే మిగులుతుందని పేర్కొన్నాడు. దీన్ని నిరసిస్తూ పుర్బా బర్దమాన్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన వైద్యులు, నర్సులు నిరసనకు దిగారు. ఇలా బెదిరింపులకు దిగిన వ్యక్తి సుశాంత రాయ్ అని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు స్థానిక పోలీసు ఆధ్వర్యంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి కం పౌర వాలంటీర్ అని చెప్పారు.