ముంబై: మద్యం మత్తులో ఉన్న రోగి, అతడి బంధువులు మహిళా డాక్టర్‌పై దాడి చేశారు. (Woman doctor assaulted) ఆ డాక్టర్ ఫిర్యాదుతో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు సియోన్ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఇద్దరు మహిళా బంధువులతో కలిసి ఒక రోగి వచ్చాడు. అతడి ముఖానికి గాయాలుండటంతోపాటు చేతుల నుంచి రక్తం కారుతున్నది.
కాగా, ఆ రోగిని ఈఎన్టీ విభాగానికి పంపారు. షిఫ్ట్‌లో ఉన్న మహిళా వైద్యురాలు ఆ రోగికి చికిత్స అందిస్తుండగా మద్యం మత్తులో ఉన్న అతడితో పాటు బంధువులు ఆ లేడీ డాక్టర్‌ను దుర్భాషలాడారు. సరైన చికిత్స అందించడం లేదని ఆరోపిస్తూ డాక్టర్‌ను బెదిరించారు. వైద్యురాలిని రోగి తోయడంతో మాటల వాగ్వాదానికి దారి తీసింది.
మరోవైపు గాయాన్ని పరిశీలించేందుకు రోగి ముఖంపై ఉంచిన కాటన్ డ్రెస్సింగ్‌ను డాక్టర్ తీసింది. దీంతో రోగి బాధతో అరవడంతో అతడి బంధువులు వైద్యురాలిపై దాడి చేశారు. దీంతో ఆమె కూడా ప్రతిఘటించింది. ఈ సందర్భంగా లేడీ డాక్టర్ స్వల్పంగా గాయపడింది. అనంతరం వారు ఆసుపత్రి నుంచి పారిపోయారు. ఆ వైద్యురాలు ఉదయం 7 గంటలకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.