లక్నో: మహిళా పోలీస్ అధికారిణి టూరిస్ట్ అవతారమెత్తింది. అర్థరాత్రి వేళ ఒంటరిగా నగరంలో షికారు చేసింది. (Woman Cop Late Night Stroll) సహాయం కోసం పోలీస్ హెల్ప్ నంబర్‌కు ఫోన్ చేసింది. అలాగే ఒంటరిగా ఆటోలో ప్రయాణించి మహిళల భద్రతను చెక్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. 33 ఏళ్ల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) సుకన్య శర్మ సాధారణ దుస్తులు ధరించారు. ఆగ్రాలో రాత్రి వేళ మహిళల భద్రతను తనిఖీ చేసేందుకు టూరిస్ట్ అవతారమెత్తారు. శనివారం అర్థ రాత్రి వేళ ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ నంబర్‌కు కాల్ చేశారు. తాను నగరానికి కొత్తగా వచ్చానని, రాత్రి వేళ రోడ్లు నిర్మాణుష్యంగా ఉండటంతో భయపడుతున్నానని, పోలీస్ సహాయం కావాలని చెప్పారు.
కాగా, హెల్ప్‌లైన్ ఆపరేటర్ స్పందించారు. సురక్షిత ప్రాంతంలో ఉండాలని సుకన్య శర్మకు చెప్పారు. ఆమె ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా పెట్రోలింగ్ టీమ్ నుంచి ఆ పోలీస్ అధికారిణికి ఫోన్ వచ్చింది. ఆమె కోసం తాము బయలుదేరి వస్తున్నట్లు చెప్పారు. దీంతో తాను ఎవరో అన్నది ఏసీపీ సుకన్య తెలిపారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ తనిఖీలో వారు పాస్ అయ్యారని చెప్పారు.
మరోవైపు ఏసీపీ సుకన్య అనంతరం ఒంటరిగా ఆటోలో ప్రయాణించారు. తానెవరో చెప్పకుండా నగరంలో మహిళల భద్రత గురించి ఆటో డ్రైవర్‌ను అడిగారు. తన ఆటోను పోలీసులు వెరిఫై చేసినట్లు ఆ డ్రైవర్ చెప్పాడు. అలాగే ఆమె చెప్పిన చోటుకు సురక్షితంగా తీసుకెళ్లాడు. సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏసీపీ సుకన్య శర్మ చర్యను ప్రశంసించారు. వాస్తవానికి మహిళల భద్రతకు సరైన మొదటి అడుగు ఇదేనని అందులో పేర్కొన్నారు.
That’s actually the first right step towards women safety. Police in every city should do this. Become a common man and experience the city yourself to know the problems people face at night. Good Job by Dr. Sukanya Sharma https://t.co/Ni3vg1iqW7
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) September 28, 2024