లక్నో: కొందరు వ్యక్తులు ఒక మహిళను బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారు. జన సంచారం లేని ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Woman Gang Raped) దీనిని వీడియో తీసి ఆమెను బెదిరించసాగారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిందితులైన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఆగస్ట్ 9న రాత్రి వేళ తాను నివసించే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తనను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఏకాంత ప్రదేశంలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. వీడియో రికార్డ్ చేసి తనను బెదిరిస్తున్నారని చెప్పింది.
కాగా, బాధిత మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆగస్ట్ 14న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులైన ఐదుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.