కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి (Suvendu Adhikari) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచిన తర్వాత ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెళ్ళగొడతామని అన్నారు. బెంగాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే స్పీకర్ కుర్చీని అవమానించారనే ఆరోపణలతో సువేందు అధికారితోపాటు బీజేపీ ఎమ్మెల్యేలను మార్చి 18 వరకు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన నిరసన తెలిపారు.
కాగా, బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ అనుమతించకపోవడాన్ని సువేందు అధికారి తప్పుపట్టారు. అలాగే సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. హిందూ జనాభా వారిని (టీఎంసీ)ని అధికారం నుంచి దూరం చేస్తుందని అన్నారు. ‘స్పీకర్ బిమన్ బెనర్జీ, సీఎం మమతా బెనర్జీని మేం ఓడిస్తాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి (టీఎంసీ) పార్టీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యేలను మరో పది నెలల్లో అసెంబ్లీ నుంచి బయటకు పంపేస్తాం’ అని అన్నారు.