న్యూఢిల్లీ, నవంబర్ 22: ‘వారానికి 48 గంటల పనితో భారత్ ప్రగతి సాధ్యం కాదు.. అభివృద్ధిలో భారత్ పరుగులు పెట్టాలంటే, చైనా లాంటి దేశాల సరసన నిలబడాలంటే మన దేశ యువత కండలు మరింత కరగదీయాలి, సామాజిక జీవితంతో పని లేకుండా రోజుకు 12 గంటల చొప్పున వారి చేత పనిచేయించాలి.. అప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది..’ అంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ సుబ్రహ్మణ్యన్ లాంటి వారు తరచూ ప్రకటనలు చేయడం.. దాందేముంది… జీ హుజూర్ అంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ ఆ దిశగా చకచకా అడుగులు వేస్తుండటం దేశంలోని శ్రామిక, కార్మిక, ఉద్యోగ వర్గాలను విస్మయ పరుస్తున్నది. తాజా లేబర్ కోడ్లను తక్షణం అమలు చేయడంపై వారికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం హఠాత్తుగా శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులు పాలిట వరమా? శాపమా అన్న చర్చ ప్రారంభమైంది. ఈ కోడ్లు గొప్ప సంస్కరణలుగా ప్రధాని మోదీ పేర్కొన్నప్పటికీ అవి కార్మికుల మెడపై వేటు వేయడానికి సిద్ధంగా ఉన్న వేటకత్తులు లాంటివని పలు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో పొందుపరిచిన సామాజిక భద్రత కోడ్, 2020పై ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులతో పాటు గిగ్ వర్కర్లకు లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, పీఎఫ్ బెనిఫిట్స్‌కు సంబంధించిన ఉద్దేశాలను ఇందులో పొందుపరిచారు. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇటీవల చైనా కంపెనీల 9-9-6 సంస్కృతిని (ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి ఆరు రోజులు లేదా వారానికి 72 గంటల పని వారాన్ని) యువత స్వీకరించాలని వరుస ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా వృత్తి భద్రత, ఆరోగ్యం, పరిస్థితులపై కేంద్రం తెచ్చిన 2020 కొత్త కోడ్ ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నది.
కేంద్రం తెచ్చిన కొత్త కోడ్ ప్రకారం రోజుకు 8 గంటల పని, నిర్ధారించని స్ప్రెడ్ ఓవర్లు (తర్వాత తెలియజేస్తారు)గా పేర్కొంటూ, స్ప్రెడ్ ఓవర్ కాలాన్ని 12 గంటల వరకు పేర్కొంది. అంటే రోజుకు 8 నుంచి 12 గంటల వరకు పనిచేయాలి. అయితే వారానికి ప్రస్తుతమున్న 48 గంటల గరిష్ఠ పని గంటల్లో ఎలాంటి మార్పు తేలేదు. అయితే దీనిలో ఇప్పుడు మార్పు తేకపోయినా, భవిష్యత్తులో స్లో పాయిజన్‌లా పెంచే అవకాశ ముందని కార్మిక సంఘాలు అనుమానపడుతున్నాయి. నారాయణమూర్తి లాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్త తరచూ 70 గంటల పనిదినాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం పని గంటలను 12కు పెంచుతూ కొత్త చట్టాన్ని తెచ్చింది. ఐఫోన్ తయారీదారు యాపిల్, దాని తయారీ భాగస్వామి ఫాక్స్కాన్యే దానికి కారణమని పలువురు ఆరోపించారు. అయితే 9-9-6 పని విధానం చట్ట విరుద్ధమంటూ చైనా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వీరెవ్వరూ కనీసం ప్రస్తావించడం లేదు.
కొత్త లేబర్ కోడ్‌లో 12 గంటల పని వేళలను ప్రోత్సహించే అంశం ఉన్నప్పటికీ వారానికి గరిష్ఠ పని గంటలైన 48 గంటల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర కార్మిక శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. ఉద్యోగులు, కార్మికులతో అవసరాన్ని బట్టి 12 గంటలు పని చేయించినా 48 గంటల గరిష్ఠ పనివేళలు దాటితే ఉద్యోగులకు ఓవర్‌టైమ్ లభిస్తుందని, ఇది చట్టంలో పొందుపరిచి ఉందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన 4 కార్మిక స్మృతులు (లేబర్ కోడ్స్)ను మదింపు చేస్తున్నట్లు జొమాటో, అమెజాన్ తెలిపాయి. ఎటర్నల్ లిమిటెడ్ (జొమాటో) స్పందిస్తూ, ఈ స్మృతులను స్వాగతిస్తున్నట్లు తెలిపింది. తమ సంస్థలోని జొమాటో, బ్లింకిట్ వ్యాపారాల్లో పని చేస్తున్న గిగ్ వర్కర్లకు సాంఘిక భద్రత పటిష్టమవడానికి ఈ నిబంధనలు దోహదపడతాయని పేర్కొంది. ఈ నిబంధనల వల్ల పడే ఆర్థిక భారం తమ వ్యాపారాల దీర్ఘకాలిక మనుగడ, స్థిరత్వాలకు హానికరమని తాము భావించడం లేదని తెలిపింది. వీటిని నోటిఫై చేసిన తర్వాత మాత్రమే ఆర్థిక, నిర్వహణపరమైన ప్రభావం గురించి స్పష్టమవుతుందని వాటాదారులకు తెలిపింది.
అమెజాన్ స్పందిస్తూ తమ ఉద్యోగులకు రక్షణ, భద్రత, సంక్షేమాలను కల్పించేందుకు తాము ప్రాధాన్యం ఇస్తామని, అందుకు అనుగుణంగానే సాంఘిక భద్రత స్మృతి ఉందని వివరించింది. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ కంపెనీ భాగస్వామి సౌమ్య కుమార్ మాట్లాడుతూ, అగ్రిగేటర్ల నిర్వహణ వ్యయాలు పెరుగుతాయన్నారు. కంపెనీలు తమ టర్నోవర్‌లో 1-2 శాతం గిగ్ వర్కర్ల సాంఘిక భద్రత కోసం కేటాయించవలసి ఉంటుందన్నారు.
కొత్తగా అమల్లోకి వచ్చిన నాలుగు కార్మిక కోడ్లు ఇరు వర్గాలకు (యాజమాన్యాలు-కార్మికులు, ఉద్యోగులు) సానుకూలంగా ఉండేలా అమలుకావాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ అభిప్రాయపడ్డారు. యాజమాన్యాలు, కార్మికుల మధ్య నిరంతరం సామాజిక చర్చను బలోపేతం చేసేలా ఉండాలని ‘ఎక్స్’లో తెలిపారు. భారత్‌లో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన లేబర్‌కోడ్స్‌ను స్వాగతిస్తున్నామని, సామాజిక రక్షణ, ఉద్యోగ భద్రతను పెంచటంలో ఒక అడుగు ముందుకు వేసినట్టుగా ఐఎల్వో పేర్కొన్నది. ‘పాలసీ బజార్’ డైరెక్టర్ సాజన్ ప్రవీణ్ స్పందిస్తూ, ’40 ఏండ్లు దాటిన ఉద్యోగుల హెల్త్ చెకప్‌లు తప్పనిసరి చేయటమన్నది చాలా ముఖ్యమైంది. అయితే యాజమాన్యాలు దీనిని ఎలా చూస్తాయన్నదాన్ని బట్టి ఉంటుంది’ అని అన్నారు.
లేబర్ కోడ్లతో వస్తున్న ప్రధాన మార్పుల్లో ఒకటి..పోర్టబిలిటీ, డిజిటల్ ప్రయోజనాల ట్రాకింగ్ అని ‘ఎన్ఐటీఈఎస్’ అధ్యక్షుడు హర్‌ప్రీత్‌సింగ్ సలుజా అన్నారు. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు..తరుచూ మారుతుంటారని, వారి ప్రయోజనాలు తిరస్కరణకు గురి కాకుండా లేబర్ కోడ్స్ సహాయపడతాయని అన్నారు. ‘జీతాలు ఆలస్యం చేయటం, నోటీస్ లేకుండా ఉద్యోగుల తొలగింపు సందర్భాల్లో లేబర్ కోడ్స్ పని చేస్తాయని అనుకుంటున్నా’ అని సలుజా అన్నారు.
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు కార్మిక స్మృతులు (లేబర్ కోడ్స్)పై కేరళ మంత్రి వీ శివన్కుట్టి శనివారం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక వ్యతిరేక వైఖరిని అవలంబించదని హామీ ఇచ్చారు. ఈ స్మృతులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
చైనా, ఆస్ట్రేలియా యూనివర్సిటీలు ఇటీవల జరిపిన ఒక సర్వేలో ఈ 9-9-6ను ‘ఆధునిక బానిస విధానం’గా పేర్కొంటూ ఈ పని పద్ధతి బానిసత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నాయి. సుప్రీం కోర్టు 2021లోనే ఈ నమూనా చట్టవిరుద్ధమని ప్రకటించిందని, ఈ నమూనా ఉత్పాదకత, ఆవిష్కరణ, పోటీతత్వం, వేతనాలను తగ్గించడం ద్వారా కార్మికులు, కంపెనీలను దెబ్బ తీస్తోందని వారి అధ్యయనం తెలియజేసింది. భారత్‌కు చెందిన కార్మికులు 2022 నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) తెలిపింది. దేశంలోని 51 శాతం ఉద్యోగులు వారానికి 49 గంటలు పనిచేస్తున్నారని తెలిపింది. చైనాలో 9-9-6 విధానం అమలులో ఉన్నా అక్కడ వారానికి సగటు పనిగంటలు 46.1 కాగా, భారత్‌లో అది 46.7 శాతం ఉందని తెలిపింది.