కాన్పూర్, అక్టోబర్ 26: వక్ఫ్ భూములు లాక్కోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసమే వక్ఫ్ బిల్లును తీసుకొచ్చిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా ఆరోపించారు. కాన్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో వక్ఫ్ బిల్లుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మనకు జీవన్మరణ సమస్య. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును అడ్డుకోవాలి. ఇందుకోసం దేశంలోని జైళ్లు ముస్లింలతో నిండిపోతాయి. అవసరమైతే మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడం.
ఒకవేళ వక్ఫ్ బోర్డుల నిర్వహణ ముస్లిమేతరుల చేతుల్లో ఉంటే వారు మసీదులు, స్మశాన వాటికల విషయంలో సానుభూతితో ఉంటారా? ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. దీని వల్ల మీ భూములు మీ నుంచి లాక్కుంటారు. తమిళనాడు, ఏపీలో కలిపి దేవాలయాలకు 10 లక్షల ఎకరాల భూమి ఉంది. ముస్లింలకు దేశమంతా కలిపి ఆరు లక్షల ఎకరాల వక్ఫ్ భూమి ఉంటే సమస్యేంటి?’ అని సైఫుల్లా వ్యాఖ్యానించారు.
కోర్టుకు డాక్యుమెంట్లు అందించకుండా, కేసు ఓడిపోయేలా వక్ఫ్ బోర్డులోని కొందరు సభ్యులపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నదని ఆయన ఆరోపించారు. కాగా, రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ముస్లిం మహిళ, ముస్లిమేతర వ్యక్తిని చేర్చాలనే ప్రతిపాదనలతో కేంద్రం కొత్త బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల అభ్యంతరాలతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమీక్షకు పంపించింది.