ముంబై: కారు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన మైనర్‌ను కాపాడేందుకు ప్రయత్నించినట్లుగా వచ్చిన ఆరోపణలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఖండించారు. నార్కో పరీక్షకు తాను సిద్ధమని తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన మహిళా కార్యకర్త సన్యాసం తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. పూణేకు చెందిన సంపన్న రియల్టర్ కుమారుడైన 17 ఏళ్ల యువకుడు మద్యం సేవించి కారును ర్యాష్‌గా డ్రైవ్ చేశాడు. ఒక బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
కాగా, పోర్స్చే ప్రమాదం తర్వాత పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్‌కు మంత్రి అజిత్ పవార్ ఫోన్ చేశారని, నిందితులను రక్షించేందుకు ఆ పోలీస్ అధికారిపై ఒత్తిడి తెచ్చారని సామాజిక కార్యకర్త అంజలి దమానియా ఆరోపించారు. అజిత్ పవార్ ఫోన్ కాల్స్‌ను తనిఖీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఆరోపణలను అజిత్ పవార్ ఖండించారు. ప్రజాప్రతినిధిగా తనకు పలువురి నుంచి ఫోన్ కాల్స్ వస్తాయని, తాను పలువురికి ఫోన్ చేస్తానని ఆయన తెలిపారు. అయితే ఎలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగవద్దని చెప్పేందుకే పూణే పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసినట్లు చెప్పారు. ‘నేను నార్కో పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నేను క్లియర్‌గా బయటకు వస్తే ఇంటిని వీడి సన్యాసం తీసుకునేందుకు ఆమె (మహిళా కార్యకర్త) సిద్ధమేనా?’ అని ప్రశ్నించారు.