భోపాల్: బలవంతపు మత మార్పిడిని సహించబోమని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (Mohan Yadav) అన్నారు. నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. దీని కోసం తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తుందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం మోహన్ యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ‘మా అమాయక కుమార్తెలపై దారుణాలకు పాల్పడే వారిపై మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని బలవంతం చేసే వారిని మేం వదిలిపెట్టం. అలాంటి వారిని జీవించడానికి అనుమతించకూడదు. బలవంతపు మత మార్పిడులు చేసే వారికి మరణశిక్ష విధించే నిబంధన మత స్వేచ్ఛ చట్టంలో చేర్చడానికి మేం కృషి చేస్తున్నాం’ అని అన్నారు.
కాగా, ‘లవ్ జిహాద్’గా పేర్కొనే బలవంతపు మత మార్పిడులపై బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా 2021 మార్చి 8న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ చట్టాన్ని ఆమోదించారు. అక్రమ మత మార్పిడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించే నిబంధన ఈ చట్టంలో ఉంది. అలాగే ఈ చట్టాన్ని ఉల్లంఘించి జరిగే ఏ వివాహం కూడా చెల్లుబాటు కాదు.