రామనగర్, జనవరి 31: ప్రధాని, రాష్ట్రపతి పదవి ఇచ్చినా తాను బీజేపీలో చేరబోనని కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మాగడిలో మంగళవారం ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ.. అధికారం కోసమే కొన్ని పార్టీలు బీజేపీతో చేతులు కలుపుతున్నాయని విమర్శించారు. ‘హిందూ వ్యతిరేకిగా నాపై బీజేపీ ముద్ర వేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి నన్ను సిద్ధరాముల్లా ఖాన్ అని సంబోధిస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ నిజమైన హిందువు. ఆయనను హత్య చేసిన నాథూరాం గాడ్సేని పూజించేవారిని నిజమైన హిందువులుగా పేర్కొనవచ్చా? వారికి గౌరవం ఉన్నదా?’ అని ప్రశ్నించారు.