MUDA Scam : మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణంపై సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతినివ్వడం సిద్ధరామయ్య అరెస్ట్‌కు దారితీయనుందా..? అనే అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గతంలో గవర్నర్లు విచారణకు అనుమతించిన అన్ని సందర్భాల్లోనూ ముఖ్యమంత్రులు అరెస్టయ్యారు. దాంతో ఇప్పుడు కర్ణాటక సీఎం కూడా అరెస్టవుతారానే ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాగా ముడా (MUDA) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. మైసూర్లో అక్రమంగా భూములు సేకరించారని సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్నాయి.
గత నెల రోజులుగా ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సామాజిక కార్యకర్త, న్యాయవాది టీజే అబ్రహం.. గవర్నర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతించారు.
వాస్తవానికి తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గవర్నర్ తిరస్కరిస్తారని సిద్ధరామయ్య భావించారు. కానీ అనూహ్యంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. సీఎంపై విచారణతో కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఎలాంటి మలుపులు తీసుకుంటాయోననే చర్చ నడుస్తోంది.