కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి, సమాజ్‌వాదీ మద్దతుతో కపిల్ సిబల్ రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ హఠాత్పరిణామం ఏంటని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే.. ఇకపై కపిల్ సిబల్ సమాజ్‌వాదీ దివంగత నేత అమర్ సింగ్ పాత్రను పోషించబోతున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఎలాగైతే సోనియా గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి న్యాయ వ్యవహారాల్లో సంకట మోచన్గా వ్యవహరించారో.. ఇప్పుడు సమాజ్‌వాదీకి అంతకంటే ఎక్కువగానే వ్యవహరించనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమర్ సింగ్ స్థానంలో కపిల్ సిబల్ ఉండబోతున్నారు.
సమాజ్‌వాదీ పార్టీకి రాజకీయ వ్యవహారాలు గానీ, ఆర్థిక వ్యవహారాలు గానీ… ఇతరత్రా వ్యవహారాలన్నీ అమర్ సింగే చూసుకునేవారు. పార్టీకి ఢిల్లీలో హోల్డ్ పెరగడానికి, సినిమా ఛరిష్మా రావడానికి గానీ అమర్ సింగ్ పోషించిన పాత్ర కీలకం. ఢిల్లీ వ్యవహారాల్లో సమాజ్‌వాదీ పార్టీ కీలకమైందంటే.. దాని వెనుక అమర్ సింగ్ కృషి ఎంతో ఉంది. బిగ్‌బీ అమితాబ్, జయా బచ్చన్ లాంటి ప్రముఖులు సమాజ్‌వాదీకి మద్దతిచ్చారంటే.. అదంతా అమర్ సింగ్ వల్లే. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలను కూడా చక్కబెట్టేవారు. ఫండ్ రైజర్‌గా కీలక భూమిక పోషించారు.
అమర్ సింగ్ క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించిన తర్వాత సమాజ్‌వాదీ చాలా ఇబ్బందులు పడింది. అమర్ సింగ్ స్థానాన్ని భర్తీ చేయడానికి సమాజ్‌వాదీకి చాలా సమయమే పడుతోంది. ఢిల్లీలో బలమైన లాబీయింగ్ చేసే నేత కరువయ్యారు. ఇప్పుడు కపిల్ సిబల్‌ను ఎంచుకొని, అన్ని రకాలుగా పార్టీ వ్యవహారాలను ఢిల్లీలో చక్కబెట్టాలని సమాజ్‌వాదీ డిసైడ్ అయ్యింది.
బీజేపీతో కూడా కపిల్ సిబల్‌కు సన్నిహిత సంబంధాలే వున్నా… అవి అంతంతే. కానీ.. బీజేపీయేత పక్షాలన్నింటితో కపిల్ సిబల్‌కు సన్నిహిత సంబంధాలే వున్నాయి. ఈ విషయాన్ని ఆయనే బహిరంగంగా ఒప్పుకుంటారు. అటు న్యాయ సలహాలు, ఇటు రాజకీయ సంబంధాల కోసం కపిల్ సిబల్‌ను వాడుకోవాలన్నది సమాజ్‌వాదీ అంతరంగం.
ఉదాహరణకు చూసుకుంటే.. తృణమూల్‌లో ఢిల్లీ వేదికగా డెరెక్ ఓ బ్రెయిన్.. మహువా మోయిత్రా అన్న ఎంపీలు వున్నారు. పార్టీ వాయిస్‌ను గానీ.. పార్టీ వ్యవహారాలను గానీ చక్కబెడుతుంటారు. ఇక ఎన్సీపీలో స్వతహాగా శరద్ పవార్ ఉన్నా… ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలే వున్నారు. ఈ పార్టీలో వీరు పనులను చక్కబెడుతుంటారు. ఇక.. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీకి ఎంపీ భర్తృహరి మెహతాబ్, పినాకినీ మిశ్రా వున్నారు. సమాజ్‌వాదీకి ఇలా వ్యవహారాలను చక్కబెట్టే నేతలెవ్వరూ లేరు. అమర్ సింగ్ మరణించిన తర్వాత సమాజ్‌వాదీ ఒంటరైంది. ఈ ఖాళీని కపిల్ సిబల్‌తో నింపాలన్నది సమాజ్‌వాదీ ప్లాన్.