భోపాల్: ఒక వ్యక్తి తన భార్య మెడకు గొలుసులు వేసి ఇంట్లో బంధించాడు. ఆమెను కొట్టడంతో పాటు వాతలు పెట్టాడు. భర్త బయటకు వెళ్లడంతో భార్య అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నది. (Woman with chain on neck) ఆ మహిళ మెడకు లాక్ వేసిన గొలుసులు ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 10న సాయంత్రం వేళ మంగిబాయి తన్వర్ భర్త మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. భోజనం తర్వాత భార్యతో గొడవపడ్డాడు. ఆమె తిరిగి తిట్టడంతో చెట్టు నుంచి కర్రను విరిచి దానితో కొట్టాడు. ఆమె చెంపలు చెళ్లుమనిపించాడు.
కాగా, భర్త హింసను భరించలేని మంగిబాయి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. అనుసరించిన భర్త ఆమెను అడ్డుకున్నాడు. ఇంటికి లాక్కెళ్లాడు. భార్య మెడకు గొలుసులు వేసి తాళం వేశాడు. ఆ చైన్‌తో స్థంభానికి ఆమెను కట్టేశాడు. అట్ల కాడను స్టౌపై కాల్చి వాతలు పెట్టాడు. ఇప్పుడు ఎలా బయటకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తావో నేను చూస్తానని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భార్యపై ఒత్తిడి తెచ్చాడు. పంచాయతీ కోసం గ్రామస్తులను పిలిచేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
మరోవైపు ఇదే అదనుగా మంగిబాయి భావించింది. సమీపంలో పడి ఉన్న రాయితో స్తంభానికి కట్టేసిన గొలుసును అతి కష్టం మీద పగులకొట్టింది. మెడలో ఉన్న సంకెళ్లతో ఇంటి నుంచి బయటపడింది. రాత్రి వేళ సుమారు ఆరు కిలోమీటర్ల దూరం నడిచింది. మార్గమధ్యంలో కొందరు వ్యక్తులు ఆమెను చూసి మానసిక పరిస్థితి సరిగా లేదని అనుమానించారు.
చివరకు రాత్రి 10 గంటల సమయంలో ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌కు మంగిబాయి చేరుకున్నది. మెడలో గొలుసులతో బంధించిన ఆమెను చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళ ఏడుస్తూ జరిగిన విషయం చెప్పింది. దీంతో పోలీసులు ఆమె గొలుసులను తొలగించారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ గ్రామానికి పోలీసులను పంపి మంగిబాయి భర్తను అరెస్ట్ చేశారు. ఆ మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.