Siddaramaiah : హిందువుల్లో కొందరు తమ మతాన్ని వదిలి మరో మతంలోకి మారుతుండటంపై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంలో సమానత్వం ఉంటే మరో మతంలోకి మారడమనేది ఉండదని అన్నారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు వేరే మతంలోకి మారతారు..?’ అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ప్రజలను మతం మారమని ఏ రాజకీయ పార్టీ కోరదని, అయినప్పటికీ మతమార్పిడులు జరుగుతున్నాయని అన్నారు. అది వారి హక్కు అని చెప్పారు. ‘హిందూమతంలో సమానత్వమే ఉంటే అంటరానితనం ఇంకా ఎందుకు మిగిలి ఉంది..? అంటరానితనాన్ని మనం సృష్టించామా..? ఇస్లాం, క్రైస్తవం, ఇతర ఏ మతాల్లోనైనా అసమానత్వం ఉండొచ్చు. మేముకానీ బీజేపీకానీ ఎవరినీ మతం మారమని కోరం, ప్రజలే మతం మారుతుంటారు, అది వారి హక్కు కూడా’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
హిందువులను టార్గెట్ చేస్తూ కర్ణాటక సీఎం చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కులం, మతం పేరుతో ప్రజలను విభజించేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని అసెంబ్లీలో విపక్ష నేత ఆర్ అశోక్ విమర్శించారు. అసమానత్వంపై ముస్లింలను సిద్ధరామయ్య ప్రశ్నించగలరా..? అని విమర్శించారు. దీనికిముందు బెంగళూరు శివాజీనగర్ మెట్రోస్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చే ఒక ప్రతిపాదనకు సిద్ధరామయ్య ఆమోదం తెలిపారు. అది కూడా వివాదమైంది.
సెయింట్ మేరి బాసిలికా వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య.. శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీగా మారుస్తామని ఆర్చిబిషప్ పీటర్ మచడోకు హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని చెప్పారు. దీన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. బుజ్జగింపు రాజకీయాల కోసం మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించింది.