న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ఇండియా టార్గెట్ చేసింది. ఆపరేషన్ సిందూర్( Operation Sindoor)లో భాగంగా మంగళవారం అర్థరాత్రి బోర్డర్ సమీపంలో ఉన్న ఉగ్ర కేంద్రాలను ఇండియా పేల్చివేసింది. మొత్తం 9 టెర్రర్ కేంద్రాలను ఇండియా టార్గెట్ చేసింది. ఆ 9 కేంద్రాలనే ఎందుకు టార్గెట్ చేసిందన్న దానిపై ఓ ప్రత్యేక రిపోర్టును అందిస్తున్నాం. ఉగ్రదాడికి ప్లాన్లు వేయడం, చొరబాట్లకు పాల్పడడం ఆ కేంద్రాల నుంచే జరుగుతోంది. ఇండోపాక్ బోర్డర్ వద్ద జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి.. పాక్ వైపున ఉన్న ఆ కేంద్రాలను ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసం చేశారు.
బహవల్‌పుర్.. జైషే ఈ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం
పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో బహవల్‌పుర్ ఉంది. ఈ ఆపరేషన్‌లో ఇదే ప్రధాన టార్గెట్. జైషే ఈ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఈ సిటీలోనే ఉన్నది. ఆ ఉగ్ర సంస్థకు మసూద్ అజార్ నేతృత్వం వహిస్తున్నారు. ఇండియాలో జరిగిన అనేక ఉగ్ర దాడులకు ఆ సంస్థతో లింకు ఉన్నది. 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడి, పుల్వామా సూసైడ్ బాంబింగ్‌కు లష్కరే సంస్థే ప్రధాన కారణం.
ముర్దికే.. లష్కరే తోయిబా బేస్ క్యాంపు.. శిక్షణ కేంద్రం
లాహోర్‌కు ఉత్తరం వైపున 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. లష్కరే తోయిబాకు ఇదో ముఖ్య కేంద్రం. ఇక్కడే లష్కరే కు చెందిన జమాత్ ఉద్ దవా వింగ్ ఉంది. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ముర్దికే కేంద్రంలో శిక్షణ ప్రాంతాలు, లాజిస్టిక్ సపోర్టు కేంద్రాలు, ఉపదేశ కేంద్రాలు ఉన్నాయి. 2008 ముంబై దాడులకు చెందిన ఉగ్ర శిక్షణ ఇక్కడే జరిగినట్లు భావిస్తున్నారు.
కోట్లీ.. బాంబర్ ట్రైనింగ్, టెర్రర్ లాంచ్ బేస్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో కోట్లీ కేంద్రం ఉన్నది. సూసైడ్ బాంబర్లు, చొరబాటుదారులకు ఇక్కడే శిక్షణ జరుగుతుంది. ఇక్కడ ఒకేసారి 50 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉన్న వసతులు ఉన్నాయి.
గుల్పూర్.. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో జరిగే దాడులకు ఈ కేంద్రం లాంచ్‌ప్యాడ్‌లా పనిచేస్తుంది. జమ్మూకశ్మీర్‌లోని ఆ రెండు జిల్లాల్లో జరిగే దాడులకు గుల్పూర్ను ఉగ్రవాదులు కేంద్రంగా మార్చుకున్నట్లు గుర్తించారు. 2023, 2024 సంవత్సరాల్లో ఇక్కడ నుంచే ఎక్కువ దాడులు జరిగాయి. భారతీయ భద్రతా కాన్వాయ్‌లు, పౌర కేంద్రాలను ఇక్కడ నుంచి ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు.
సవాయి.. కశ్మీర్ లోయల్లో జరిగే దాడులకు ఇక్కడ ఉన్న లష్కరే క్యాంపుకు లింకు ఉన్నది. ఉత్తర కశ్మీర్లో జరిగే దాడులకు సవాయి క్యాంపుతో లింకు ఉన్నట్లు గుర్తించారు. సోన్మార్గ్, గుల్మార్గ్, పెహల్గామ్లో జరిగే దాడుల్లో సవాయి ఉగ్ర క్యాంపుతో లింకు ఉన్నది.
సర్జల్, బర్నాలా.. చొరబాటుదారులకు ఇవి కేంద్రాలు.. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్నాయి. సర్జల్, బర్నాలా కేంద్రాలు.. చొరబాటుదారులకే ముఖ్య కేంద్రాలుగా భావిస్తున్నారు.
మెహమూనా ఉగ్ర కేంద్రం.. హిజ్బుల్ ముజాహిద్దిన్ ఇక్కడ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సియాల్కోట్ కు సమీపంలో ఈ క్యాంపు ఉన్నది. ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిద్దిన్ దీన్ని వాడుతున్నది. కశ్మీర్లో చాన్నాళ్ల నుంచి ఈ క్యాంపు యాక్టివ్‌గా ఉన్నది. నిజానికి ఈ గ్రూపు ప్రస్తుతం తన కార్యకలాపాలను తగ్గించినా.. దాని ఆనవాళ్లు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బిలాల్ క్యాంపు.. జేషే మొహమ్మద్‌కు చెందిన మరో ల్యాంచ్‌ప్యాడ్ ఇది. దీన్ని కూడా గత రాత్రి దాడిలో ధ్వంసం చేశారు. చొరబాటుకు పాల్పడడానికి ముందు ఉగ్రవాదులు ఇక్కడే బస చేస్తారు. భారతీయ భూభాగంలోకి చొరబాడేందుకు ఈ క్యాంపును తుది ట్రాన్సిట్ పాయింట్‌గా భావిస్తారు.