న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం తలెత్తింది. (Delhi Govt vs Lt Governor ) ఈ నేపథ్యంలో ‘ప్రతి వివాదం’పై తమను ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులను స్తంభించడంపై ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (డీసీపీసీఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డీటీసీ బస్సుల్లో మార్షల్స్గా పనిచేస్తున్న సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల సేవలను రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం సవాల్ చేసింది.
కాగా, ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య జరుగుతున్న ప్రతి వివాదం ఆర్టికల్ 226 పిటిషన్ కిందకు వస్తాయని, అయితే ఇవి తమ వద్దకు ఎందుకు వస్తున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ను ఆర్టికల్ 32 కింద ఎందుకు స్వీకరించాలని నిలదీసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం కొన్ని రిట్లను జారీ చేయడానికి హైకోర్టులకు అధికారం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని డీసీపీఆర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్కు ధర్మాసనం సూచించింది.