న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : స్మగ్లింగ్ (అక్రమ రవాణా) చేసుకొనే అవకాశం ఉన్నప్పుడు ఉత్పిత్తి కేంద్రాలను ఎందుకు నిర్మించాలి? అని ప్రశ్నించి ప్రముఖ ఆర్థికవేత్త, భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొత్త వివాదానికి తెరతీశారు. భారత్ తన సొంత సెమీ కండక్టర్ వ్యవస్థను నిర్మించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశ్నిస్తూ రఘురామ్ రాజన్ ఈ వ్యాఖ్య చేశారు. సెమీ కండక్టర్ల ప్రోత్సాహం వెనుక ఉన్న హేతుబద్ధతపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. దేశీయ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి భారత్ వందల కోట్ల డాలర్లను ఎందుకు వెచ్చిస్తున్నదని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. చాలా చిప్సెట్లు చాలా చిన్నవిగా ఉండటం వల్ల అవి భూమిపై అత్యంత సులభంగా స్మగ్లింగ్ చేయగల వస్తువులు అని రఘురామ్ రాజన్ వాదించారు. చైనా, రష్యా ఇప్పటికే వాటిని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నాయని కూడా ఆయన చెప్పారు.
రఘురామ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రఘురామ్ ఆలోచన మనకు ముందే ఎందుకు రాలేదు. కార్లు, ట్రక్కులు, రాకెట్లు, ఉపగ్రహాలు, ఇంకా చిప్‌లను కూడా స్మగ్లింగ్ చేయడం! ఈ వ్యక్తిని ఆర్బీఐ గవర్నర్‌గా నియమించారు! అని వ్యాపారవేత్త అశుతోష్ మాలిక్ చమత్కరించారు.