ముంబై, ఫిబ్రవరి 8: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవ్రా పార్టీని వీడగా, తాజాగా మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ పార్టీకి రాజీనామా చేశారు.
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్టు తాజాగా ప్రకటించారు. 48 ఏండ్లుగా పార్టీలో కొనసాగిన ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో గురువారం సందేశాన్ని పోస్ట్ చేశారు. సిద్దిఖీ కుమారుడు జీషన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.