పాట్నా : బీహార్‌కు సంబంధించిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాల్లో అవకతవకలు జరిగాయన్న వార్తలపై ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. కొన్ని రైళ్లకు నిప్పు పెట్టారు. ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌లో భాగంగా రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. మరి విద్యార్థుల అల్లర్లు, ఆందోళనల వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఖాన్ సార్ అనే వ్యక్తి ఈ ఆందోళనలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఎవరీ ఖాన్ సార్? ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అభ్యర్థుల ఆందోళనలో అతని పాత్రం ఏంటి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీశారు.
ఖాన్ సార్.. ఈయన పోటీ పరీక్షలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తుంటారు. ఖాన్ సార్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్‌కు 14.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. రైల్వేస్, ఎన్డీఏ, నేవీ, సీడీఎస్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నేస్పై అవగాహన కల్పిస్తుంటారు.
అయితే ఖాన్ సార్ పూర్తి వివరాలు తెలియలేదు. కేవలం ఆయన అప్డేట్ చేస్తున్న వీడియోలు మాత్రం పాట్నా నుంచి అప్లోడ్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వయసు, ఇతర వివరాలు తెలియవు. కానీ ఖాన్ సార్ 1993లో జన్మించినట్లు తెలుస్తోంది. ఇక ఈయన ఓ మొబైల్ యాప్, వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఖాన్ సార్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఖాన్ సార్ విడుదల చేసిన వీడియోను చూసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే జాతీయ దినోత్సవం నేపథ్యంలో జనవరి 26న ఆందోళనకు దిగొద్దని అభ్యర్థులను ఖాన్ సార్ కోరాడు. రైతుల నిరసనల మాదిరి విద్యార్థులు నిరసన చేపడితే అదుపు చేయడం కష్టమని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోను ఖాన్ సార్ యూట్యూబ్ చానెల్ నుంచి తొలగించారు.
మొత్తానికి అభ్యర్థులు జనవరి 26న హింసకు పాల్పడ్డారు. రైళ్లకు నిప్పు పెట్టడంతో రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఖాన్ సార్ మరో వీడియో విడుదల చేశాడు. భారత్ బంద్‌ను విరమించుకోవాలని కోరాడు. ఎన్టీపీసీ ఫలితాల్లో అవకతవకలకు సంబంధించిన అంశం ఆర్ఆర్బీది అని పేర్కొన్నాడు. ఇందుకు రైల్వే మంత్రిని, ప్రధానమంత్రిని తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నాడు.
ఖాన్ సార్ వీడియోలు విద్యార్థులను ఆందోళనల వైపునకు ప్రేరేపించాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఖాన్ సార్‌తో పాటు మరో ఐదుగురు టీచర్లు ఎస్కే జా, నవీన్, అమర్నాథ్, గగన్ ప్రతాప్, గోపాల్ వర్మపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖాన్ సార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్‌మెంట్‌ను న్యాయంగా చేపట్టాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఖాన్ సార్‌పై కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.