అమృత్సర్: ఖలిస్తానీ గ్రూపు వార్సి పంజాబ్ కే చీఫ్ అమృతపాల్ సింగ్(Amritpaal Singh) మద్దతుదారులు గురువారం అమృత్సర్(Amritsar) లో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కత్తులు, లాఠీలు, గన్నులతో .. నగరంలోని పోలీసు స్టేషన్‌పై దాడి చేసింది ఆయన మద్దతుదారులే. అజ్నాలా పోలీసు స్టేషన్‌పై ఆ గ్యాంగ్ అటాక్ చేసింది. ఈ కారణంతో అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ తూఫాన్ను రిలీజ్ చేశారు. ఆ పోలీస్ స్టేషన్ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఇంతకీ ఈ అమృత్‌పాల్ సింగ్ ఎవరో తెలుసుకుందాం.
అమృతపాల్ సింగ్.. ఓ స్వీయ బోధకుడు. ఖలీస్తాన్ మద్దతుదారు(Khalistani Supporter). 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నడిపిన జర్నేల్ సింగ్ బింద్రన్‌వాలా అందరికీ తెలిసిందే. బింద్రన్‌వాలా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్‌లో హతుడయ్యాడు. అయితే అతని స్టయిల్లో అమృతపాల్ బోధకుడిగా వ్యవహరిస్తున్నాడు. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు.
ఖలిస్తానీ గ్రూపు వార్సి పంజాబ్ దేకు చీఫ్‌గా అమృత్‌పాల్ సింగ్ ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి రోడ్డు ప్రమాదంలో సింగర్ దీపూ సింగ్ మృతిచెందిన విషయం తెలిసిందే. వార్సి పంజాబ్‌దేను దీపూ స్థాపించారు. అయితే దీపూ మరణం తర్వాత ఆ గ్రూపును అమృత్‌పాల్ నడిపిస్తున్నారు. ప్రభుత్వమే దీపును చంపినట్లు అమృత్ ఆరోపిస్తున్నారు.
బింద్రన్‌వాలా తరహాలో అమృత్‌పాల్ సింగ్ డ్రెస్ చేసుకుంటున్నారు. టర్బన్ కూడా కట్టుకుంటున్నారు. సాంప్రదాయ సిక్కు గుర్తుల్ని ఆయన క్యారీ చేస్తుంటారు. తన వద్ద ఉన్న భారీ ఆయుధ దళం ఫౌజువాన్తో ఇటీవల గోల్డెన్ టెంపుల్‌ను కూడా విజిట్ చేశారు. సామాజిక రుగ్మతలు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి బింద్రన్‌వాలా స్టయిల్లోనే జనాల్ని ఆకర్షిస్తున్నారు. సపరేటు సిక్కు దేశం కావాలని పోరాడుతున్నారు. బింద్రన్‌వాలా ఎలా పోరాడాడో, అదే అడుగుజాడల్లో అమృత్‌పాల్ నడుస్తున్నాడు.
ఖలిస్తానీ ఉద్యమాన్ని అణిచివేస్తామని వార్నింగ్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అమృత్ బెదిరించారు. ఇందిరా గాంధీ తరహాలోనే చంపేస్తామన్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐతో అమృత్‌పాల్ సింగ్‌కు ఏదైనా లింకు ఉందా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.