లక్నో: ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దాడులు జరుగుతాయని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ రాష్ట్రంలో జోరుగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్నోలో బుధవారం మాట్లాడారు. కేంద్రం, యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష రాష్ట్రాల్లో దాడులు జరుగుతాయని భూపేశ్ ఆరోపించారు. ఉత్తరాఖండ్, గోవా, యూపీ సీఎం బంధువుల ఇంట్లో ఎందుకు దాడులు చేయడం లేదు? అని ప్రశ్నించారు. 11 మంది కాదు అంపైర్లతో సహా 13 మంది ఆటగాళ్లు ఆడుతారని పాకిస్థాన్ గురించి చెప్పిన ఆయన, అదే మాదిరిగా కేంద్ర ఏజెన్సీలతో కలిసి ఎన్నికల్లో బీజేపీ పోరాడుతుందని ఎద్దేవా చేశారు.
రైతులను అన్ని విధాలా అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని భూపేశ్ బఘేల్ విమర్శించారు. ద్రవ్యోల్బణం నుండి విముక్తి పొందాలనుకుంటే, రైతులు లాభపడాలనుకుంటే ఈ ప్రభుత్వాన్ని తొలగించండి అని పిలుపునిచ్చారు. తాను ఇంటింటికి ప్రచారానికి వెళ్లానని, ప్రజలు యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్నానని చెప్పారు.