న్యూఢిల్లీ: సింధూ నది జలాలను భారత్ అడ్డుకుంటే రక్తం పారుతుందన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్దారు. (Asaduddin Slams Bilawal Bhutto) పాక్ మాజీ ప్రధాని అయిన ఆయన తల్లి బెనజీర్ భుట్టో, ఆ దేశ మాజీ అధ్యక్షుడైన ఆయన తాత జుల్ఫికర్ అలీ భుట్టోను చంపింది ఎవరో గుర్తు చేసుకోవాలని అన్నారు. ‘వారు (ఉగ్రవాదులు) మీ అమ్మని కాల్చిచంపితే అది ఉగ్రవాదం. వారు (ఉగ్రవాదులు) మా తల్లులు, కుమార్తెలను చంపినప్పుడు, అది ఉగ్రవాదం కాదా?’ అని ప్రశ్నించారు.
కాగా, భారత్‌పై బిలావల్ భుట్టో వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటలని అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. ‘అలాంటి చిన్నపిల్లల మాటలు మర్చిపోండి. తన తాతకు ఏమి జరిగిందో ఆయనకు తెలియదు? ఆయన తల్లిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాబట్టి కనీసం ఆయన ఇలా మాట్లాడకూడదు. మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకైనా తెలుసా? అమెరికా మీకు ఏదైనా ఇస్తే తప్ప దేశాన్ని నడపలేరు. అలాంటి మీరు మమల్ని ఎత్తిచూపేలా మాట్లాడతారు’ అని విమర్శించారు.
మరోవైపు అణు బాంబులను గురిపెట్టామన్న పాకిస్థాన్ నేతల బెదిరింపులపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఒక దేశంలోకి ప్రవేశించి అమాయకులను చంపితే, ఎంత పవర్ ఉన్నప్పటికి ఏ దేశం మౌనంగా ఉండదని స్పష్టం చేశారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారని నిలదీశారు. ‘మీరు మా దేశంపై దాడి చేసిన విధానం, మతం అడిగి కాల్చివేయడం ఖవారిజ్ (ఇస్లాం మతం ఫిరాయింపుదారుల) కంటే హీనంగా ఉన్నారు. మీరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు’ అని పాక్ నేతలను దుయ్యబట్టారు.