మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రష్యాలోని మొత్తం 85 రీజియన్లలో 39,849 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన 40,096 కేసులతో పోల్చితే కొద్దిగా తగ్గినట్లే చెప్పవచ్చు. తాజా కేసులతో కలిపి రష్యాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,32,546కు చేరింది. కొత్త కేసులలో 3,442 మందికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని రష్యాలోని ఫెడరల్ రెస్పాన్స్ సెంటర్ తెలిపింది.
ఇక రష్యా రాజధాని మాస్కోలో అత్యధికంగా 7,511 మందికి కరోనా వైరస్ సోకింది. క్రితం రోజు నమోదైన 8,440 కేసులతో పోల్చుకుంటే ఇది తక్కువే. ఆ తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్‌లో 3,452 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు 3,186 కేసుల కంటే ఇది ఎక్కువ. ఇక మాస్కో రీజియన్‌లో గురువారం 2,639 కేసులు నమోదు కాగా ఇవాళ 2,556 మందికి కరోనా సోకింది. ఇక గురువారం 1,159 మంది కరోనా బాధితులు మరణించగా.. ఇవాళ ఆ సంఖ్య 1,163కు చేరుకుంది.