Najma Heptulla | న్యూఢిల్లీ, డిసెంబర్ 1: తాను 1999లో ఇంటర్-పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు సోనియా గాంధీకి బెర్లిన్ నుంచి ఆ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే గంట సేపు నిరీక్షించేలా చేశారని ఆ పార్టీ మాజీ నేత నజ్మా హెప్తుల్లా తెలిపారు. సోనియా సిబ్బంది ఒకరు మేడమ్ బిజీగా ఉన్నారని తనకు బదులిచ్చారని ఆమె వెల్లడించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నజ్మా హెప్తుల్లా 2004లో సోనియా గాంధీతో విభేదాల కారణంగా బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌లో తనకెదురైన పలు అనుభవాలను ఆమె తాజాగా విడుదల చేసిన తన ఆత్మకథ ‘ఇన్ పర్సూట్ ఆఫ్ డెమొక్రసీ: బియాండ్ పార్టీ లైన్స్’ పుస్తకంలో పేర్కొన్నారు.
ఐపీయూ అధ్యక్ష పదవికి ఎన్నికై, తాను భారత పార్లమెంట్ నుంచి మొదటిసారి ప్రపంచ పార్లమెంటరీ వేదిక పైకి అడుగు పెట్టడం చరిత్రాత్మకం అని ఆమె అన్నారు. ఈ విషయం గురించి మొదట తాను నాటి ప్రధాని వాజ్‌పేయికి ఫోన్ చేసి తెలుపగానే ఆయన సంతోషించారని..‘మీరు తిరిగి రండి.. మనం సంబరాలు చేసుకుందాం’ అని అన్నారని ఆమె తెలిపారు. అప్పటి తన పార్టీ నాయకురాలు సోనియాకు ఈ విషయమై ఫోన్ చేస్తే తాను గంట సేపు నిరీక్షించినా ఆమె లైన్లోకి రాలేదన్నారు. దాంతో తాను నిజంగా ఎంతో నిరాశ చెందానన్నారు. ‘ఏదేమైనా ఆ ఘటన ముందస్తుగా నిరూపితమైన ఒక తిరస్కరణ.
కాంగ్రెస్‌లోని పాత తరం, అనుభవజ్ఞులకు సంక్షోభ కాలం. పార్టీ కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన వారిని నిరాశ పరిచి భ్రష్టు పట్టించిన సమయం. అనుభవం లేని, భజన చేసే కొత్త కోటరీ పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించారు’ అని నజ్మా విమర్శించారు. పార్టీ పనితీరుకు కీలకమైన ఫీడ్ బ్యాక్ ఇవ్వడంలో తన లాంటి వారికి ఎలాంటి చురుకైన పాత్ర లేకుండా పోయిందని.. ఆ నాటి నుంచి పార్టీ పతనం ప్రారంభమైందని ఆమె వెల్లడించారు. ‘చాలా దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో వెల్లివిరిసిన సహకార సూత్రాల భావనకు వ్యతిరేకంగా ఆమె ప్రవర్తన ఉండేది’ అని నజ్మా హెప్తుల్లా అన్నారు.