15 ఆగస్టు 2024 బెంగళూరు వీధుల్లో పంద్రాగస్టు వేడుకల సందడి. హఠాత్తుగా రెపరెపలాడే జాతీయ జెండాతో కుక్కలు పరుగులు తీస్తున్నాయి. ఆ డాగ్ పరేడ్ చూసిన ప్రజలు జాతీయ జెండాకు, కాళ్లు విరిగిన కుక్కలు వాటి కాళ్లపై అవి నిలబడి బతికేలా చేసిన ఓ మంచి ప్రయత్నానికి సెల్యూట్ చేశారు!
విశ్వాసంలో శునకాన్ని మించిన జీవి లేదు. మనిషి కూడా అది చూపించే విశ్వాసానికి సాటి రాలేడు. ఎంత విశ్వాసం చూపినా ఏం లాభం? ఈ మనిషితో కుక్కలకు ఎన్ని చిక్కులో! రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు విరగ్గొట్టుకున్న శునకాలను చూస్తే.. మనసు చివుక్కుమంటుంది. నడవలేక, కనీసం కదల్లేక అవి పడుతున్న అవస్థ చూసి హృదయం తల్లడిల్లుతుంది. రాత్రుళ్లు వాహనాల కింద పడుకున్నప్పుడు, రోడ్డు పక్కన ఉన్న వీధికుక్కలు తరచూ ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. కాలు విరిగినా, తెగిపోయినా ఇక వాటి బతుకు నరకమే. నాలుగు కాళ్లూ భద్రంగా ఉన్నప్పుడే వీధికుక్కలను పట్టించుకునే నాథుడు ఉండడు. రోజంతా తిరిగినా వాటి ఆకలి తీరదు. ఇక నడవలేని పరిస్థితి వస్తే.. వాటి డొక్కలు ఎండిపోతాయి. ఆకలి బాధకు కాళ్లు ఈడ్చుకుంటూ తిరిగే వీధికుక్కలను చూసి జాలిపడతాం అంతే! కానీ, వాటి ఆకలి తీర్చే తీరిక ఎంతమందికి ఉంటుంది? కానీ, బెంగళూరులో గ్రామసింహాల రోదన ఆలకించే రోర్ (రెమిస్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ రిహాబిలిటేషన్) ఉంది. అంటే.. ప్రమాదాల బారినపడి వైకల్యంతో బాధపడుతున్న కుక్కలకు వైద్యం అందించే సంస్థ. కాలు విరిగిన శునకాలను మళ్లీ మునుపటిలా పరిగెత్తిస్తుందీ ఆర్గనైజేషన్.
గ్రామసింహాల కోసం గర్జన
ప్రత్యేక అవసరాలున్న, వైకల్యంతో బాధపడుతున్న కుక్కల సంరక్షణ కోసం ఈ సంస్థ ఏర్పడింది. బెంగళూరు నగరంలోని హెన్నూరు రోడ్లో ఉందీ ఎన్జీవో. వైకల్యం బారినపడిన వీధికుక్కల కోసం ప్రత్యేకంగా చక్రాల కుర్చీలు తయారు చేస్తుంటుంది. నడవలేని మనిషి చక్రాల కుర్చీల సాయం తీసుకున్నట్టు.. నడవలేని శునకాలకు చక్రాల కాళ్లు అమర్చుతుందన్నమాట. కుక్కల శరీర సౌష్టవానికి తగినట్టుగా తేలికపాటి బరువుతో దృఢంగా ఉండే లోహపు కడ్డీలతో చక్రాల కాళ్లు తయారు చేయిస్తుంటారు. శునకాల ఎత్తుకు తగ్గట్టుగా వీటిని సరి చేయవచ్చు.
వీధికుక్కల సమస్యకు ఓ పరిష్కారం
బెంగళూరు వీధుల్లో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న వీధికుక్కలను రోర్ ఎన్జీవో సంస్థ సభ్యులు గుర్తించి వాటన్నిటినీ చికిత్స కోసం ఓ కేంద్రానికి తరలిస్తారు. వైద్యుల పరీక్షల తర్వాత వాటి కాళ్లు సాధారణ చికిత్సతో పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తారు. సాధ్యం కాకపోయినా, లేదా కాలు పూర్తిగా తెగిపోయిన కుక్కలకు చక్రాల కాళ్లు అమరుస్తారు. చక్రాలు అమర్చిన తర్వాత వాటికి నడవడంలో కొంతకాలం పాటు శిక్షణ ఇస్తారు. ఐడియా బాగుంది కదా! అంతేకాదు ఊరకుక్కల్ని వీధుల్లో వదిలేయకుండా చేరదీస్తున్నారు. వాటికి వైద్యం చేస్తారు. వాటిని పెంచుకునేందుకు స్థానికులను ఒప్పిస్తున్నారు. పన్నెండేళ్లలో ఎన్నో కుక్కలను బతికేలా, నడిచేలా, జంతు ప్రేమికులు పెంచుకునేలా చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ల దగ్గర 40కి పైగా వైకల్యం బారినపడిన.. చక్రాల కాళ్ల సాయంతో నడిచే కుక్కలు ఉన్నాయి.!
రెమీ ప్రేమకు ముగ్ధుడై
రోర్ ఎన్జీవో నిర్వాహకుడు ఆనంద్ కృష్ణన్ శ్రీనివాసన్ యానిమల్ హైడ్రోథెరపిస్ట్గా పని చేస్తున్నాడు. పన్నెండేళ్ల క్రితం ఆయన చెన్నైలో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డుపై ప్రమాదంలో గాయపడ్డ ఓ కుక్క కనిపించింది. దానిని కారులో తీసుకుని పశు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అది బతికింది. కానీ, నడవలేని స్థితిలో ఉంది. ఆ కుక్కను తన వెంట తీసుకెళ్లి పెంచుకున్నాడు. దానికి రెమీ అని పేరు పెట్టుకున్నాడు. ఆ కుక్క చూపే విశ్వాసానికి ముగ్ధుడై మళ్లీ నడిపించాలనుకున్నాడు. దానికోసం ఓ చక్రాల కాలు తయారు చేయించాడు. అది అటూ ఇటూ తిరుగాడటం ఆయనకు అబ్బురమనిపించింది. అప్పటినుంచి వీధుల్లో, ఇళ్లలో వైకల్యంతో బాధపడుతున్న కుక్కలకు ఉచితంగా వైద్యం అందించేందుకు రోర్ సంస్థను ప్రారంభించాడు. డాగ్ లవర్స్ ఇచ్చే విరాళాలతో వైకల్యంతో ఉన్న కుక్కలను కాపాడుతూ ప్రేమను చాటుకుంటున్నాడు ఆనంద్!