కోల్‌కతా, ఆగస్టు 14 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై లైంగిక దాడి చేసింది ఒక్కరు కాదని, అది గ్యాంగ్ రేప్ అని పోస్టుమార్టం నివేదిక వెల్లడించిందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి శరీరంలో అధిక మొత్తంలో 151 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్టు తేలిందని డాక్టర్ సువర్ణ గోస్వామి తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టులో వేసిన పిటిషన్లో వెల్లడించినట్టు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. 151 ఎంజీ పరిమాణంలో వీర్యం అంటే ఒక్కరి నుంచి రాదని, లైంగిక దాడిలో పలువురి ప్రమేయం ఉన్నట్టు ఇది చెబుతున్నదని ఆఖిల భారత ప్రభుత్వ వైద్యుల సంఘం అదనపు ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్న డాక్టర్ గోస్వామి అన్నారు.
తమ కుమార్తెపై సామూహిక లైంగిక దాడి జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. గొంతు పిసికి చంపడం వల్లనే తమ కుమార్తె మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించిందని తెలిపారు. తమ కుమార్తె సామూహిక లైంగిక దాడి, హత్యకు గురైనట్టు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ ఇతర నిందితులను అరెస్టు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాలేజీ ప్రిన్సిపాల్, ఇతర సంబంధిత వ్యక్తులను ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదని పేర్కొన్నారు.కాగా, ఈ ఘటనపై వస్తున్న విమర్శల మీద సీఎం మమతా బెనర్జీ స్పందించారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తున్నా కూడా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ, సీపీఎం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
బెంగాల్ ఘటన నేపథ్యంలో మహిళా సిబ్బంది, విద్యార్థినులకు అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ చేసిన సూచనలు విమర్శలకు కారణమయ్యాయి. నిర్మానుష్య, చీకటి ప్రదేశాలకు వెళ్లొద్దని, రాత్రి పూట హాస్టల్ బయటకు రావొద్దని, మర్యాదగా మాట్లాడాలని అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై విమర్శలు రావడంతో వెనక్కు తీసుకుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఈనెల 21 నుంచి మొదలవుతున్న యూజీసీ-నెట్ పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ చిన్న మార్పు చేసింది. ఆగస్టు 26న ‘కృష్ణ జన్మాష్టమి’ వచ్చినందున, ఆ రోజు నిర్వహించాల్సిన పరీక్షను ఆగస్టు 27కు వాయిదా వేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. ‘యూజీసీ-నెట్ జూన్ 2024 ఎగ్జామ్స్’ షెడ్యూల్లో మిగతా పరీక్షలన్నీ ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: కేంద్ర హోం శాఖ తదుపరి కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ నియమితులయ్యారు. మోహన్‌ను హోం మంత్రిత్వ శాఖలో తక్షణం ఓఎస్డీగా నియమించారు. ప్రస్తుతం హోం సెక్రటరీగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ భల్లా పదవీ కాలం ఈ నెల 22తో ముగుస్తుంది. తదుపరి ఆయన స్థానంలో మోహన్ బాధ్యతలు చేపడతారు.