న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు స్వల్ప ఊరట ఇచ్చారు. (Union Budget 2025) ఆదాయ వడ్డీపై పన్ను మినహాయింపు (టీడీఎస్) పరిమితిని రెట్టింపు చేయాలని, అద్దెపై పరిమితిని పెంచాలని ప్రతిపాదించారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.50,000 నుంచి రూ. లక్షకు రెట్టింపు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇతరులకు టీడీఎస్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచినట్లు చెప్పారు. అలాగే అద్దెపై టీడీఎస్ కోసం వార్షిక పరిమితిని రూ.2.40 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. తద్వారా తక్కువ పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
కాగా, సీనియర్ సిటిజన్లకు జాతీయ పొదుపు పథకం (ఎస్ఎస్ఎస్) ఖాతాల నుంచి విత్ డ్రా పన్ను మినహాయింపును కూడా బడ్జెట్లో పేర్కొన్నారు. ఎలాంటి వడ్డీ చెల్లించని సేవింగ్స్ ఖాతాలకు 2024 ఆగస్ట్ 29 నుంచి ఇది వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే సీనియర్ సిటిజన్లకు సంక్షేమ సహాయాన్ని అందించే అటల్ వయో అభ్యుదయ యోజన (AVYAY)కు రూ.289.69 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.